నేడు భారత్-శ్రీలంక టీ-20 మ్యాచ్

ఇప్పటికే వరస విజయాలతో లంక టీమ్‌ను ఉతికారేస్తుంది టీమ్ ఇండియా. భారత్ ధాటికి కనీసం పోటీని కూడా ఇవ్వలేక స్వదేశంలో పరువు తీసుకుంటోంది శ్రీలంక. వరుస విజయాలతో హుషారుగా ఉన్న టీమ్ ఇండియాకు ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. కొలొంబో వేదికగా లంకతో నేడు జరగనున్న టీ 20ని గెలుచుకుని లంక గడ్డపై విజయపరంపరను పూర్తిగా తమ వశం చేసుకునేలా కోహ్లీ సేన ప్లాన్ చేస్తోంది.

స్వదేశంలో వరుస పరాజయాలతో అభిమానుల ఆగ్రహానికి గురైన లంక టీమ్‌ మాత్రం ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని కనీసం పరువు కాపాడుకోవాలనే ఆలోచనలోఉంది. అందుకు అనుగుణంగా జట్టులో పలు కీలక మార్పులు కూడా చేసింది. వన్డే సిరీస్‌కు ముందు ప్రకటించిన జట్టులోకి కొత్తగా లెగ్ స్పిన్నర్ జె ఫ్రే వాండర్‌సే, సీమర్ షనకలను తీసుకుంది. రెండో టెస్టులో గాయపడ్డ లక్మల్, మిస్టరీ స్పిన్నర్ ధనంజయలకు చోటు కల్పించారు. లెగ్ స్పిన్నర్ సందకన్, పేసర్లు ఫెర్నాండో, చమీరాను తప్పించారు. బౌలింగ్‌లో మార్పులు చేసిన లంకబోర్డు.. బ్యాట్స్‌మెన్‌పై దృష్టిపెట్టలేదు. బ్యాటింగ్‌లో డిక్వెల్లా, మునవీర, మాథ్యూస్, తరంగపైనే ఎక్కువ భారం పడనుంది. భారత టీ20 స్టార్ బౌలర్లను ఎదుర్కొవడం వీళ్లకు సాధ్యమవుతుందో లేదో చూడాలి.

లంక టూర్ తర్వాత ఈ సీజన్‌లో భారత్ తొమ్మిది టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో రెండు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లు ఉండే అవకాశాలున్నాయి.