నేటి నుంచి భారత్-ఆసీస్ వన్డే సిరీస్  

అసలైన క్రికెట్ మజాకు సమయం వచ్చేసింది. వరల్డ్ బెస్ట్ టీమ్స్ మధ్య సూపర్ క్రికెట్ వార్ కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో అమీతుమీకు తేల్చుకోనుంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా తొలి వన్డే కోసం సర్వసన్నద్దం అయింది. ఈ మధ్యే శ్రీలంకను చిత్తుగా ఓడించిన కోహ్లీ సేన కంగారులకు భరతం పట్టేందుకు రెడీ అవుతోంది. సొంతగడ్డపై ఆసీస్ ను ఓ ఆట ఆడుకోవాలని చూస్తోంది.  అటు బలమైన ప్రత్యర్థి టీమిండియాను ఢీ కొట్టేందుకు ఆసీస్ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంది. తొలి వన్డేలోనే బోణీ కొట్టి ఆతిథ్య జట్టుకు షాకివ్వాలని చూస్తోంది.

వరల్డ్ క్రికెట్ లో క్లాష్ ఆఫ్ దీ టైటాన్స్ గా దూసుకుపోతున్న భారత్- ఆసీస్ లు తొలి వన్డేలో గెలుపే లక్ష్యం గా బరిలోకి దిగుతున్నాయి.ఆటగాళ్లంతా సూపర్ ఫామ్ లో ఉండటంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విజయంపై ధీమాతో ఉన్నాడు. ఓపెనర్ ధావన్ దూరమైనా.. రిజర్వ్ బెంచ్ అత్యంత పటిష్టంగా ఉండటంతో గణమైన బోణీ కోసం ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక స్టీవెన్ స్మిత్ సారథ్యంలోని ఆసీస్ టీమ్ సైతం టాలెంటెడ్ యంగ్ ప్లేయర్లతో టీమిండియాకు గట్టి సవాల్ విసురుతోంది. తొలి వన్డేలోనే గెలిచి టూర్ ను అద్బుతంగా ఆరంభించాలని చూస్తోంది.

ఓపెనర్ ధావన్ లేకపోవడంతో రోహిత్ జతగా గా రహానే బరిలోకి దిగనున్నాడు. ఇక దుర్భేధ్యమైన మిడిలార్డర్ టీమిండియా సొంతం. కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉండగా.. కేఎల్ రాహుల్, ధోనీ, పాండ్యా, మనీష్ పాండే లాంటి మేటి ప్లేయర్లతో టీమిండియా అత్యంత బలంగా కనిపిస్తోంది. ఇక బౌలింగ్ లో భువీతో పాటు బూమ్రా, యంగ్ స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ లతో భారత్ బౌలింగ్  ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇక ఐపీఎల్ తో భారత పిచ్ లపై మంచి అనుభవం గడించిన ఆస్ట్రేలియా ప్లేయర్లు కోహ్లీ సేనను సమర్థవంతంగా ఎదురుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.

ఇక వన్డేల్లో టీమిండియా నెంబర్ వన్ కావాలంటే.. ఐదు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాల్సిందే. గత కొంతకాలంగా స్వదేశీ, విదేశాల్లో వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియాకు  సొంతగడ్డపై ఎదురులేని రికార్డు ఉంది.. అయితే బంగ్లా చేతిలో టెస్ట్ ఓటమితో ప్రభావం కంగారులపై పడే అవకాశం ఉంది. అటు ఆసీస్ అంటేనే అద్భుత బ్యాటింగ్ తో అలరించే రోహిత్ శర్మపై మరోసారి కంగారులపై పై చేయి సాధించేందుకు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మిడిలార్డర్ లో జాదవ్ ఫేయిల్ అవుతుండటంతో మనీష్ పాండేకు అవకాశం దక్కడం దాదాపుగా ఖాయమే.

కఠిన సిరీస్ కోసం ఆసీస్ గట్టిగానే ప్రిపేర్ అయ్యింది, అయితే స్టార్ పేసర్లు స్టార్క్, హాజెల్‌వుడ్ లేకపోవడంతో కంగారుల బౌలింగ్ విభాగం కాస్త బలహీనమైంది, బ్యాటింగ్ లో మాత్రం వరల్డ్ క్లాస్ బ్యాట్స్ మెన్లు ఉండటంతో టీమిండియాకు టఫ్ ఫైట్ ఇవ్వాలని చూస్తోంది. యంగ్ స్పిన్నర్ ఎగర్ పై ఆసీస్ భారీ ఆశలే పెట్టుకుంది. అయితే ఉపఖండ పిచ్ లపై అంతగ అవగాహన లేని ఎగర్ ఈ సిరీస్ లో తన సత్తాను పరిక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు,

ఈ ఐదు వన్డేల సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ కోహ్లీ సేన టాప్ ప్లేస్ లోకి దూసుకు రానుంది. అటు ఉపఖండ పిచ్ లకు ఉన్న పేలవ రికార్డ్ ను తుడిచేందుకు ఆసీస్ ప్లేయర్లు తీవ్రంగా శ్రస్తున్నారు. వారం రోజుల ముందే  జట్టు కూర్పుపై దృష్టి పెట్టారు.