నెత్తిమీదికి 150 ఏళ్లు వచ్చినా మారరా!

ముంబైలోని ఎల్ఫిన్‌ స్టోన్ రైల్వేస్టేషన్‌ లో నిన్న జరిగిన తొక్కిసలాటలో 23 మంది చనిపోవడంతో కేంద్ర రైల్వే శాఖ మేల్కొన్నది. ఆ శాఖ మంత్రి పీయూష్ గోయల్ రైల్వే భద్రతపై సమీక్ష నిర్వహించారు. ముంబైలోని పశ్చిమ రైల్వే ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి రైల్వే ఉన్నతాధికారులు హాజరయ్యారు. రైల్వేస్టేషన్లలో భద్రతపై అధికారులను గోయల్ ఆరా తీశారు. ముంబై సబర్బన్ రైల్వేస్టేషన్‌ లో భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లపై పూర్తిస్థాయి ప్రణాళిక తయారు చేయాలన్నారు.

భారత రైల్వే నెత్తిమీదికి 150 ఏళ్లు వచ్చినా మారరా అంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశ్నించారు. రైల్వేస్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు ప్రయాణీకుల సౌకర్యం కోసం మాత్రమే కాదని, అవి సంస్థ తప్పనిసరిగా కల్పించాల్సిన సౌకర్యమని సీరియస్ గా స్పందించారు. పశ్చిమ రైల్వే హెడ్ క్వార్టర్స్ నుంచి 200 మంది అధికారులను క్షేత్రస్థాయికి బదిలీ చేశారు. వారంతా రైల్వేస్టేషన్లలో భద్రతకు సంబంధించిన పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ముంబైలోని రద్దీగా ఉండే సబర్బన్ రైల్వే స్టేషన్లలో అదనపు ఎస్కలేటర్లను కేంద్రమంత్రి పీయూష్ మంజూరు చేశారు. ఆ తర్వాత రద్దీగా ఉండే మిగతా రైల్వేస్టేషన్లలో కూడా అదనపు ఎస్కలేటర్లు నిర్మించాలని చెప్పారు. అధికార యంత్రాంగం అనుమతుల కోసం ఎదురుచూడకుండా భద్రతకు అవసరమైన ఖర్చు పెట్టేందుకు జనరల్ మేనేజర్లకు అనుమతి ఇచ్చామని పీయూష్ వెల్లడించారు.

నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనపై కేంద్రమంత్రి సీరియస్‌ గా ఉన్నారని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పీయూష్ గోయల్ చెప్పినట్లు అధికారి పేర్కొన్నారు. ఎల్ఫిన్‌ స్టోన్ రైల్వేస్టేషన్‌ లో నిన్న జరిగిన తొక్కిసలాటలో 23 మంది ప్రాణాలు కోల్పోగా, 35 మంది గాయపడ్డారు.