నూతన మంత్రుల ప్రొఫైల్..

1.అనంత్ కుమార్ హెగ్డే:

కర్నాటకకు చెందిన అనంత్ కుమార్ హెగ్డే.. ఉత్తర కన్నడ నియోజక వర్గం నుంచి ఐదోసారి లోక్‌ సభకు ఎన్నికయ్యారు. 1998లో విదేశాంగ సహాయ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2000 నుంచి 2003 వరకు పర్యావరణ, అటవీశాఖ సహయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు.. మానవ వనరుల అభివృద్ధి పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల్లో సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. దీంతో పాటు గ్రామీణాభివృద్ధి, గ్రామీణారోగ్యం, స్వయం సహాయక సంఘాల్లో  సేవలందించే ఓ స్వచ్ఛంద సంస్థను సొంతగా నడుపుతున్నారు.

2.శివ ప్రతాప్ శుక్లా:

ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గోరఖ్‌పూర్ జిల్లాలోని కజనీలో జన్మించిన ఈయన.. దీన్ దయాల్‌ వర్సిటీ నుంచి లా పట్టా పొందారు. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యూపీ మంత్రిగా 8 ఏళ్లుగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. గ్రామీణాభివృద్ధి, విద్య, జైళ్ల శాఖల్లో సంస్కరణలు చేపట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం గ్రామీణాభివృద్ధిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యునిగా పనిచేస్తున్నారు.

3.సత్యపాల్ సింగ్‌:

మాజీ ఐపీఎస్‌ అధికారి అయిన సత్యపాల్ సింగ్‌ .. 2014 ఎన్నికల్లో యూపీలోని బాగ్‌పత్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. హోం శాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీలో సభ్యుడిగా, లాభదాయక పదవుల సంయుక్త కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఏపీ, మధ్యప్రదేశ్‌లలో నక్సలైట్ల నియంత్రణకు కృషిచేసినందుకు 1990లో ప్రత్యేక సేవా పతకాన్ని అందుకున్నారు. 1990ల్లో ముంబైలో వ్యవస్థీకృత నేర వ్యవస్థ నడ్డి విరిచినందుకు ప్రశంసలందుకున్నారు. ముంబై, పుణె నగరాల పోలీస్‌ కమిషనర్‌గానూ పనిచేశారు.

4.అశ్వినీ కుమార్ చౌబే:

బీహార్‌లోని బక్సర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర జౌళి మండలిలో సభ్యుడైన ఈయన.. గతంలో బిహార్‌ శాసనసభకు వరసగా ఐదు సార్లు ఎన్నికయ్యారు. 1974–75లో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ నేతృత్వంలో వచ్చిన బిహార్‌ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లపాటు పట్టణాభివృద్ధి, ప్రజారోగ్యం తదితర మంత్రిత్వ శాఖలు నిర్వహించారు.
5.రాజ్‌కుమార్‌ సింగ్‌:

మాజీ ఐఏఎస్‌ అధికారి అయిన రాజ్‌కుమార్‌ సింగ్‌.. ప్రస్తుతం బిహార్‌లోని ఆరా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సిబ్బంది, పింఛన్లు, ప్రజా ఫిర్యాదులపై ఏర్పాటైన వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో సభ్యుడిగా ఉన్నారు. గతంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శిగానూ పనిచేసిన అనుభం ఉంది.
6.వీరేంద్ర కుమార్‌:

మధ్యప్రదేశ్‌లోని టికంగఢ్ నియోజకవర్గం నుంచి లోక్‌ సభకు ఎన్నికైన ఈయన.. మొత్తం ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. నాలుగుసార్లు సాగర్‌ నుంచి, రెండుసార్లు టికంగఢ్  నుంచి ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం కార్మిక సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడిగా పని చేస్తున్నారు. గతంలోనూ పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు.

7.హర్‌దీప్ సింగ్‌ పూరి:

ఢిల్లీకి చెందిన హర్‌దీప్ సింగ్‌ కి విదేశాంగ వ్యవహారలపై మంచి పట్టుంది. 1974 ఢిల్లీ ఐఎఫ్‌ఎస్ క్యాడర్‌ అధికారి అయిన ఈయన.. ప్రస్తుతం ఆయన అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన ఆర్‌ఐఎస్‌ అనే మేధో సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నారు. 2009 నుంచి 2013 వరకు ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధిగా పని చేశారు. ఆ తర్వాత యూఎన్‌ఓ భద్రతా మండలిలో కౌంటర్ టెర్రరిజం కమిటీ అధ్యక్షుడిగా, బ్రెజిల్‌లో భారత రాయబారిగా విధులు నిర్వహించారు.
8.గజేంద్ర సింగ్ షెకావత్‌:

ఈయన ప్రస్తుతం రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘంలో సభ్యుడిగా, ఫెలోషిప్‌ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాస్కెట్‌బాల్‌ జాతీయ ఆటగాడైన గజేంద్ర సింగ్‌ షెకావత్‌… ప్రస్తుతం భారత బాస్కెట్‌ బాల్‌ ఆటగాళ్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.

9.ఆల్ఫోన్స్‌ కన్ననాథం:

కేరళకు చెందిన ఆల్ఫోన్స్‌ కన్ననాథం మాజీ ఐఏఎస్ అధికారి. గతంలో ఢిల్లీ అభివృద్ధి సంస్థ కమిషనర్‌గా పనిచేశారు. అప్పుడే 15 వేల అక్రమ నిర్మాణాలను కూల్చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. దీనికి గాను 1994లో టైమ్స్‌ మేగజీన్‌ ప్రచురించిన 100 ప్రపంచ యువ నాయకుల జాబితాలో చోటు లభించింది.