నూతన కేబినెట్ మంత్రుల ప్రొఫైల్..

1.ధర్మేంద్ర ప్రదాన్‌:

ఒడిశాకు చెందిన ప్రదాన్‌ స్వతంత్ర హోదాలో పెట్రోలియం శాఖను నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ ఆశించిన లక్ష్యాల మేరకు పనిచేసి మంచి ఫలితాలు సాధించారు. ముఖ్యంగా గ్యాస్‌ సబ్సిడిని స్వచ్ఛందంగా వదులుకునే ‘గివ్‌ఇట్‌అప్‌’ పథకం విజయవంతమయ్యేట్టు చర్యలు తీసుకున్నారు. చమురు మంత్రిత్వశాఖలో లాబీయింగ్‌ ఎక్కువగా ఉంటుంది. వీటిని కూడా నియంత్రించారు. మరో వైపు చూస్తే ఒడిశాలో కొన్ని నెలల క్రితం జరిగిన స్థానిక ఎన్నికల్లో భాజపా గెలుపునకు తీవ్రంగా కృషిచేశారు.

2.పీయూష్‌గోయల్‌:

మహారాష్ట్రకు చెందిన గోయల్‌ విద్యుత్‌శాఖలో కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కేంద్రప్రభుత్వ లక్ష్యమైన నూటికి నూరు శాతం విద్యుద్దీకరణను విజయవంతంగా పూర్తిచేస్తున్నారు. విద్యుత్‌ ఉత్పాదన కూడా భారీస్థాయిలో పెరిగింది. పూర్తి నిబద్ధతతో పనిచేస్తారన్న గుర్తింపు వుంది. దీంతో ఆయనకు పదోన్నతి కల్పించారు. ప్రస్తుతం రైల్వేశాఖను నిర్వహిస్తున్న సురేష్‌ప్రభును మార్చి ఆ శాఖను గోయల్‌కు అప్పగించవచ్చని సమాచారం.

3.నిర్మలా సీతారామన్‌:

నిర్మలా సీతారామన్‌ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిత్వ శాఖ ( స్వతంత్ర) హోదాలో నిర్వహిస్తున్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వ విధానాలను మీడియాకు వివరించడంలో ముందుంటారు. చైనాలో జరిగిన బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొన్నారు.

4.ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ:

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నఖ్వీ భాజపాలోకి కీలక ముస్లిం నేత. పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వ విధానాలను గట్టిగా వివరించడంతో పాటు ప్రతిపక్షాలను సమర్థంగా ఎదుర్కొంటారు.