‘నిశ్చింత్’ యాప్ తో ‘బ్లూ వేల్’ కు వల

విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న అతి ప్రమాదకరమైన బ్లూ వేల్ గేమ్ కి బ్రేకులు వేసేందుకు సరికొత్త యాప్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ గేమ్ లాంటి మరెన్నో ప్రాణాంతకమైన గేమ్స్ ని కట్టడి చేసేందుకు తెలంగాణ విద్యా శాఖ ఐటి శాఖతో కలిసి సరికొత్త అప్లికేషన్ ను విడుదల చేసింది.

ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లలు ప్రాణాంతక గేమ్స్ కి అడిక్ట్ అవుతున్నారు. అందులో ఒకటి బ్లూ వేల్ గేమ్. ఈ గేమ్ ఆడేవాళ్ళు ఎంతటి సాహసానికైనా పాల్పడతారు. అందుకే ఈ బ్లూ వేల్ గేమ్ కి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ ఐటి శాఖతో కలసి స్కూల్ యాజమాన్యాలు, పేరెంట్స్ అసోసియేషన్స్ తో ఓ వర్క్ షాప్ ను కండక్ట్ చేసింది. బ్లూ వేల్ గేమ్ తో పాటు మరికొన్ని గేమ్స్ బ్యాన్ చేసేందుకు తెలంగాణ ఐటి శాఖ సహకారంతో సరికొత్త అప్లికేషన్ విడుదల చేసింది. ప్రమాదకరమైన గేమ్స్ డౌన్ లోడ్ చేసుకోకుండా ఉండేందుకే నిశ్చింత్ యాప్ ను  విడుదల చేశారు. ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా బ్లూ వేల్ గేమ్ ని కట్టడి చేయవచ్చని ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ చెప్పారు.

ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మంది ఈ యాప్ ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు నిశ్చింత్ యాప్ ఫౌండర్ రాఘవ మిమాని. ఈ యాప్ వినియోగంతో సోషల్ మీడియాలో వచ్చే అనవసరపు యాప్ లను డౌన్ లోడ్ చేసుకోకుండా కట్టడి చేయొచ్చన్నారు. ముఖ్యంగా పిల్లలు కొత్త గేమ్ యాప్స్ కోసం చూస్తుంటారని, ప్రస్తుతం మార్కెట్ లో నిశ్చింత్ అనే యాప్ అందుబాటులో ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్ధుల భవిష్యత్తు కోసం ఆలోచిస్తోంది కాబట్టే… ప్రభుత్వం సహకారంతో ఈ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు.

మొబైల్, డెస్క్ టాప్ కంప్యూటర్స్ లో ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ కిషన్ చెప్పారు. పేరెంట్స్ ఈ యాప్ ద్వారా అన్ని గేమ్స్ ని కంట్రోల్ చేయొచ్చన్నారు. రోజురోజుకి పెరిగిపోతున్న పిల్లల ఇష్యూస్ ని దృష్టిలో పెట్లుకుని ఈ వర్క్ షాప్ ని స్కూల్ యాజమాన్యం, పేరెంట్స్ అసోషియేషన్స్ తో కలిసి నిర్వహించామన్నారు.