నిరుపేద విద్యార్థులకు ‘ఓవర్సీస్’ వరం

పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఓవర్సీస్ పథకంతో చేయూతను అందిస్తున్నది. అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ, మైనార్టీ ఓవర్సీస్ విద్యా పథకాలను అమలు చేస్తున్నది. ఓవర్సీస్ పథకం కింద విదేశాల్లో విద్యావకాశాల కోసం వెళ్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్ఠంగా రూ.20 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నది.

ఓవర్సీస్ పథకం ప్రారంభించిన మూడున్నర ఏండ్లలో ఒక వెయ్యి 720 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం 292 కోట్ల 37 లక్షల రూపాయలను ఖర్చు చేసింది. రాష్ట్రంలోని దళిత, గిరిజన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య కోసం అంబేద్కర్ ఓవర్సీస్ పథకం పేరుతో ప్రభుత్వం ఆర్థికసాయం అందజేస్తున్నది. బీసీల కోసం మొదటిసారిగా మహాత్మా జ్యోతిరావు ఫూలే ఓవర్సీస్ స్కాలర్‌ షిప్ పథకాన్ని గతేడాది  ప్రారంభించింది.

ఇంతకుముందు 10 లక్షల రూపాయలు ఉన్న ఆర్థికసాయాన్ని.. ప్రభుత్వం ఈ ఏడాది నుంచి పెంచింది. 20 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. దరఖాస్తు చేసుకునే విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలవారికి రూ.1.50 లక్షలు కాగా.. పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు ఉండాలని నిర్ణయించారు. విద్యార్థులు అమెరికా, ఆస్ట్రే లియా, కెనడా, సింగపూర్, లండన్‌ లోని వర్సిటీల్లో చదువుకునే అవకాశం ఉంటుంది.