నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండ

ఆరోగ్యశ్రీతో రాష్ట్రంలోని లక్షల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతూ ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేదలు ప్రభుత్వం చలువతో కార్పోరేట్ దవాఖానాల్లో ఉచితంగా చికిత్స పొందుతున్నారు.. గత మూడేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా 7 లక్షల 73 వేల 755 మందికి శస్త్రచికిత్సలు జరిగాయి. వారికోసం ప్రభుత్వం 2,021 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఆరోగ్యశ్రీ పథకం కింద దాదాపు 29 విభాగాల్లో ఆపరేషన్లు జరిగాయి.

ఆరోగ్యశ్రీ లో ప్రధానంగా కిడ్నీ సంబంధవ్యాధులున్న లక్ష 38వేల 79 మందికి ఆపరేషన్లు జరిగాయి. ఈ శస్త్రచికిత్సల కోసం ప్రభుత్వం 195.57 కోట్లు ఖర్చు చేసింది. క్యాన్సర్ కు సంబంధించి లక్షా 29 వేల 24 మందికి వైద్యం అందించడానికి 73.71 కోట్లు ఖర్చు చేసింది. ఇక ప్రమాదాల్లో గాయపడ్డ లక్ష 13 వేల 650 మందికి శస్త్రచికిత్సల కోసం 350.40 కోట్లు, మూత్ర సంబంధింత వ్యాధుల ఆపరేషన్లు చేయించుకున్న  82వేల 848 మందికి  182. 72 కోట్లు, గుండె వ్యాధుల ఆపరేషన్లు చేయించుకున్న 48 వేల 371 మందికి 342.95 కోట్లు, చిన్నపిల్లల విభాగంలో 39వేల 374 మంది వైద్యానికి 101.85 కోట్లు ఖర్చు చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన ఆరోగ్యశ్రీ పథకం.. స్వరాష్ట్రంలో మాత్రం పేదలకు ఉపయోగపడుతోంది. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటోంది. పేదల జీవితాల్లో వెలుగులు నిండేలా చేస్తోంది. రాష్ట్రంలో 85 లక్షల తెల్లరేషన్ కార్డులండగా 2. 75 కోట్ల మంది ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులున్నారు. వీరిలో లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. అటు ప్రభుత్వం ఉద్యోగులు, రిటైర్ ఎంప్లాయిస్ తో పాటు జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఈజేహెచ్ఎస్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఉచితంగా వైద్యసేవలు అందిస్తోంది.

వివిధ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రత్యేక వైద్యశిబిరాలు నిర్వహిస్తోంది. బాదితులను ముందస్తుంగా అప్రమత్తం చేసి వారికి సరైన వైద్యసేవలు అందిస్తోంది.