నిరాశ్రయులు, నీడలేని వృద్ధులకు జీహెచ్ఎంసీ బాసట

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ లో నిరాశ్ర‌యులు, నీడ‌లేని వృద్ధుల‌ను గుర్తించి వారికి పున‌రావాసం క‌ల్పించ‌డంతో పాటు త‌గు వైద్య స‌హాయాలు అందించ‌డానికి ఈ నెల 16వ తేదీ వ‌ర‌కు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని జీహెచ్ఎంసీ చేప‌ట్టింది. న‌గ‌రంలోని ప‌లుచోట్ల వృద్ధులు ఫుట్‌ పాత్‌ ల‌పై ఉండే దృశ్యాల‌ను గ‌మ‌నించిన రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు వారికి జీహెచ్ఎంసీ నైట్ షెల్ట‌ర్‌ లో ఆశ్ర‌యం క‌ల్పించాల‌ని ఆదేశించారు. దీంతో న‌గ‌రంలో నిరాశ్ర‌యుల‌ను గుర్తించేందుకు 11వ తేదీ నుండి 16వ తేదీ వ‌ర‌కు స‌ర్వే ప్రారంభించాల‌ని అర్బ‌న్ క‌మ్యునిటీ విభాగాన్ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌ రెడ్డి ఆదేశించారు.

దీంతో యు.సి.డి విభాగానికి చెందిన అధికారులు, సిబ్బంది, స్థానిక మ‌హిళా సంఘాలు, టి.ఎల్.ఎఫ్‌ ల స‌హ‌కారంతో నిరాశ్ర‌యుల‌ను గుర్తించే ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఎవ‌రైనా నిరాశ్ర‌యులు క‌నిపించిన‌ట్లైతే జీహెచ్ఎంసీకి స‌మాచారం అందించాల‌ని క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీకి చెందిన భానుప్ర‌కాష్ సెల్ నెం: 97013 85140, క్రిష్ణ 97013 85138 అనే నెంబ‌ర్ల‌కు స‌మాచారం అందించాల‌ని కోరారు.

గ‌త 15 రోజుల వ్య‌వ‌ధిలో ముగ్గురు నిరాశ్ర‌యుల‌ను గుర్తించి మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ట్విట్ట‌ర్ ద్వారా స‌మాచారం అందించ‌డంతో వీరిని జీహెచ్ఎంసీ సిబ్బంది నైట్ షెల్ట‌ర్ల‌లో చేర్పించారు. దిల్‌ సుఖ్‌ న‌గ‌ర్‌, ప్యార‌డైజ్ సెంట‌ర్‌, టి.ఎస్‌.పి.ఏ జంక్ష‌న్‌ల వ‌ద్ద ఈ ముగ్గురు వృద్ధ మ‌హిళ‌ల‌ను గుర్తించి వారికి నైట్‌ షెల్ట‌ర్‌ లో ఆశ్ర‌యం క‌ల్పించారు. రాబోయే శీతాకాలం, వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకొని ఈ స‌ర్వేను చేప‌డుతున్న‌ట్టు క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు.