నిమ్స్‌కు మరో అరుదైన గుర్తింపు

రాష్ట్రంలో వైద్యరంగం అద్భుతంగా దూసుకెళ్తుంది. మెరుగైన వైద్యసేవలు అందిస్తూ.. అటు ప్రజలకు  దగ్గరవుతూనే వివిధ పురస్కారాలు అందుకుంటుంది. తాజాగా నిమ్స్‌ కు  మెరుగైన వైద్య సేవలు అందించినందుకు గానూ ఇంటర్నేషనల్‌ సొసైటీ ఆఫ్‌ పెరిటోనియల్‌ డయాలసిస్‌ గుర్తింపు దక్కింది. రోగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారు ఇంటి వద్దనే డయాలసిస్‌ చేసుకునేలా ప్రోత్సహించడంలో నిమ్స్‌ ముందున్నది. దీంతో డయాలసిస్‌కు రోజూ ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య తగ్గుతున్నది. ఈ సేవలకు గానూ ఐఎస్‌ పీడీ గుర్తింపు పొంది.. దక్షిణ భారతదేశంలోనే మొదటి దవాఖానాగా నిమ్స్‌ నిలిచింది.

రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్‌ ఆస్పత్రిపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంది. గత మూడున్నరేళ్లలో నిమ్స్‌ లో సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించింది. ఫలితంగా నిమ్స్‌ లోని కిడ్నీ సంబధిత వ్యాధులకు చికిత్స అందించే నెఫ్రాలజీ విభాగం వైద్య సేవలు మెరుగుపడ్డాయి. కార్పోరేట్‌ స్థాయి దవాఖానాల్లో ఉండే హీమో డయాలసిస్‌ మెషీన్లను నిమ్స్‌ లో ఏర్పాటు చేసి బాధితుల రక్తాన్ని శుద్ది చేస్తున్నారు. దీంతో బాధితులు నిమ్స్‌ కు క్యూ కట్టేవారు. బాధితులు తరచూ వ్యయప్రయాసలకు ఓర్చి ఆస్పత్రికి వస్తుండటంలో అధికారులు పెరిటోరియల్‌ డయాలసిస్‌ ఇంటి వద్దనే చేసుకునేలా శిక్షణ ఇస్తున్నారు. ప్రాథమిక దశలో రోగుల కేవలం రెండు మూడు నెలలు మాత్రమే దవాఖానాకు రావాల్సి ఉంటుంది. తర్వాత ఎవరికి వారే డయాలసిస్‌ చేసుకునేలా రోగులకు శిక్షణ ఇస్తున్నారు.

ప్రతిఏటా 40 మంది టెక్నీషియన్స్‌ కు డయాలసిస్‌ విభాగంలో శిక్షణ ఇస్తున్నారు. ఫలితంగా ఫెరిటోనియల్‌ డయాలసిస్‌ కోసం నిమ్స్‌ కు వచ్చే బాధితుల సంఖ్య తగ్గుతున్నది. ఇక నిమ్స్‌ లో కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంటేషన్ల సంఖ్య గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. రాష్ట్రంలోని ఏ దవాఖానకు సాధ్యం కాని విధంగా ఈ ఏడాది జూన్‌ నాటికి వెయ్యి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేశారు.

ఇక నిమ్స్‌ లోని నెఫ్రాలజీ విభాగానికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2013లో ఔట్‌ పేషెంట్ల 25,922 మంది కాగా.. 2014లో 27,111..2015లో 27869.. 2016లో 39342 మంది వచ్చారు. ఇక ఇన్‌ పేషెంట్లు 2013లో 4832 మంది కాగా.. 2014లో 5397.. 2015లో 5831..2016లో 6555 మంది వచ్చారు. ఇక హీమో డయాలసిస్‌లో 2013లో 34327 మంది జాయిన్‌ అవ్వగా.. 2014లో 35726కాగా .. 2015లో 34333కాగా 2016లో 33121 మంది జాయిన్‌ అయ్యారు. ఇక యూవీ కాన్యులేషన్‌ లో 1024 మంది, 2014లో 2536, 2015 1013, 2016లో 1277, ఇక రెనల్‌ బయాప్సీలో 2013 సంవత్సరానికి గానూ.. 283, 2014కు గానూ.. 2536, 2015 గానూ.. 1013, ఇక ప్లాస్మా పెరెసిస్‌ 2013లో 112కాగా 2014లో 172, 2015-లో 151.. 2016 కు గానూ.. 214 మంది డయాలసిస్‌ వైద్యం చేయించుకున్నారు.