నిమజ్జనోత్సవానికి సిద్ధం

భాగ్యనగరంలో వినాయక చవితి ఉత్సవాలు తుదిదశకు చేరుకున్నాయి. అత్యంత వైభవోపేతంగా నిమజ్జనాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. శోభాయాత్ర జరగనున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసు ఉన్నతాధికారులు సీసీ కెమెరాల ద్వారా అనుక్షణం పరిస్థితిని పర్యవేక్షించనున్నారు.

గత నెల 25న కొలువుదీరిన గణనాథుల నిమజ్జనం మూడో రోజు నుంచే మొదలైంది. దీంతో ఇప్పటివరకు నగరంలో దాదాపు 50శాతం వినాయకుల నిమజ్జనం పూర్తయింది. ఇక మిగిలిన విగ్రహాలు కూడా సాగరతీరానికి వెళ్లేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు.  నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వం అన్ని విభాగాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది. జీహెచ్ఎంసీ తరపున కూడా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం త్వరగా జరిగేలా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రేపు ఉదయమే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం లోపే ఈ భారీ విగ్రహాన్ని నిమజ్జనం చేసేలా ప్రణాళిక వేశారు. మహావినాయకుడిని ట్రాలీపై ఉంచేందుకు అవసరమైన లెవలింగ్ కోసం భారీ ఇనుప రాడ్లను వెల్డింగ్ చేశారు. మింట్ కాంపౌండ్ లోని పీడబ్ల్యూడీ వర్క్ షాప్ కు చెందిన ఉద్యోగులు ఈ పనులు చేశారు.

ఉదయం నుంచే నిమజ్జనం ప్రారంభం కానుంది. ట్యాంక్ బండ్ తో పాటు సిటీలోని పలు ప్రాంతాల్లో నిమజ్జనోత్సవం జరగనుంది. ఈ మేరకు బేబీ పాండ్స్ (కుంటలు) సిద్ధం చేశారు. ముఖ్యంగా ట్యాంక్ బండ్ పై క్రేన్లు సిద్ధంగా ఉన్నాయి.

శోభాయాత్రకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శోభాయాత్ర జరగనున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నిమజ్జనం సాఫీగా జరగడానికి జీహెచ్ఎంసీ, పోలీసు శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మేరకు నిమజ్జనం జరగనున్న అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.

శోభాయాత్రకు సంబంధించి అధికారులు ఇప్పటికే రూట్ మ్యాప్ ను పరిశీలించారు.  బాలాపూర్ నుంచి గణపతి ఊరేగింపు ప్రారంభం కానుంది. అలియాబాద్ నాగుల్ చింత-చార్మినార్- అఫ్జల్ గంజ్ – ఎం.జె.మార్కెట్ – అబిడ్స్ – బషీర్ బాగ్ –  లిబర్టీ మీదుగా అప్పర్ ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ వరకు కొనసాగుతుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవి మధ్యలో కలుస్తాయి.

సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ఊరేగింపు ఆర్పీరోడ్ నుంచి మొదలవుతుంది. ఎంజీ రోడ్ కర్బలా మైదానం- కవాడిగూడ- ముషీరాబాద్ క్రాస్ రోడ్డు- ఆర్టీసీ క్రాస్ రోడ్డు- నారాయణగూడ క్రాస్ రోడ్డు- హిమాయత్ నగర్ వై జంక్షన్ మీదుగా లిబర్టీ వద్ద విగ్రహాలు  కలుస్తాయి.

హైదరాబాద్ కు తూర్పు వైపు నుంచి వచ్చే ఊరేగింపులు ఉప్పల్ – రామంతాపూర్ – అంబర్ పేట్- ఓయూ ఎన్సీసీ – దుర్గాభాయ్ దేశ్ ముఖ్ ఆసుపత్రి మీదుగా ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వచ్చి కలుస్తాయి. పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చే ఊరేగింపులు ఎంజే మార్కెట్ తో పాటు సచివాలయం- ఫ్లైఓవర్ దగ్గర కలుస్తాయి.

నిమజ్జనోత్సవంలో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లతో పాటు 24 వేల సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పోలీసు ఉన్నతాధికారులు అనుక్షణం పరిస్థితిని పర్యవేక్షించనున్నారు. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయనున్నారు.

నిమజ్జనోత్సవం నేపథ్యంలో ఆయా మార్గాల్లో మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 8 వరకు సాధారణ ట్రాఫిక్ ను అనుమతించరు. అవసరాన్ని బట్టి ఆంక్షల్లో మార్పులు- చేర్పులు జరగనున్నాయి.