నిత్యావసరాల ధరల నియంత్రణకు చర్యలు

నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు పకడ్బంది చర్యలు తీసుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అన్నారు. ముఖ్యంగా బియ్యం, ఉల్లిగడ్డల ధరలు అదుపులో ఉంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో పౌరసరఫరాల అధికారులు రోజువారీగా నిత్యావసర ధరల అంశాన్ని పర్యవేక్షించాలని అలాగే, జిల్లా స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు తరచు సమావేశాలు నిర్వహించి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. నిత్యావసర సరుకులను బ్లాక్‌ మార్కెట్‌ కు తరలించడం, అక్రమంగా నిల్వలు చేసి ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. ఈ విషయంలో వ్యాపార, వర్తక సంఘాల నాయకులు చొరవ తీసుకుని అక్రమ వ్యాపారం చేసే వ్యాపారుల వివరాలను ప్రభుత్వానికి అందించాలని విజ్ఞప్తి చేశారు.

నిత్యావసర సరుకుల ధరలు ముఖ్యంగా బియ్యం, ఉల్లిగడ్డలు, వంటనూనె తదితర వస్తువుల ధరల నియంత్రణపై గత రెండు మూడు రోజులుగా ఉల్లిగడ్డ, వంటనూనె వ్యాపారులు, రైస్‌ మిల్లర్‌లతో కమిషనర్‌ సీవీ ఆనంద్ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ధర నియంత్రణపై తరచుగా వ్యాపారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించాలని హైదరాబాద్‌ చీఫ్‌ రేషనింగ్‌ అధికారిని ఆదేశించారు.