నాది వక్కాణింపు మాత్రమే!

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మరోసారి నోటి దురుసు ప్రదర్శించారు. ట్విట్టర్లో వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శల పాలయ్యే ఆయన ఈసారి ఏకంగా ప్రధాని మోడీనే టార్గెట్ చేశారు. అసభ్య పదజాలంతో మోడీని విమర్శిస్తున్న ఓ ఫోటోను ట్విట్టర్‌ లో షేర్‌ చేశారు. ఆ ఫోటో కు డిగ్గీ రాజా తన కామెంట్లను యాడ్‌ చేశారు. ప్రజలను ఫూల్స్ చేయటంలో ప్రధాని మోడీ సిద్ధహస్తుడని కామెంట్ పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్‌ పై దుమారం రేగింది. దిగ్విజయ్‌ కామెంట్ పై పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ట్వీట్ పై తీవ్ర విమర్శలు రావటంతో డిగ్గీ రాజా డ్యామేజ్‌ కంట్రోల్‌ కు ప్రయత్నించారు. తాను పోస్ట్ చేసిన ఫోటోలో ఉన్న వ్యాఖ్యలు తనవి కావని వివరణ ఇచ్చారు. వేరే ఎవరో పోస్ట్ చేసిన ఫోటోను రీ ట్వీట్ చేశానని చెప్పారు. ఆ ఫోటోకు కామెంట్లు మాత్రమే తాను పెట్టానని చెప్పారు. చేయని కామెంట్లపై విమర్శించటం సరికాదని అన్నారు.

దిగ్విజయ్‌ సింగ్ ట్వీట్‌ పై బీజేపీ తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ మెంటల్‌ బ్యాలెన్స్ ఎలా ఉందో ఈ ట్వీట్ ద్వారా అర్థం చేసుకోవచ్చని బీజేపీ నేత జి.వి.ఎల్ నరసింహ రావు విమర్శించారు. ప్రధాని పట్ల వాడిన భాషకు కాంగ్రెస్ నేతలు సిగ్గుపడాలని, 130 కోట్ల ప్రజలను అవమానపరిచేలా దిగ్విజయ్‌ మాట్లాడారని ఫైరయ్యారు. ఈ విషయంలో ప్రధాని మోడీకి దిగ్విజయ్‌ క్షమాపణ చెప్పేంత వరకు వదలమన్నారు నరసింహారావు.

అటు ఎన్డీఏ పక్షాల నేతలు సైతం దిగ్విజయ్‌ వాడిన భాషపై విమర్శలు గుప్పించారు. ప్రధానిపై విమర్శలు చేసేప్పుడు హుందాగా వ్యవహరించాలని సూచించారు.