నవంబర్ 28 నుంచి పారిశ్రామిక వేత్తల సదస్సు

హైదరాబాద్‌ వేదికగా జరిగే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నవంబర్ రెండోవారం వరకు అవగాహన సదస్సులు కొనసాగనున్నాయి. అందులో భాగంగా ఇటీవల హైదరాబాద్‌ టీ-హబ్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో వరంగల్ నిట్, హైదరాబాద్ బిట్స్ పిలానీ, ఇతర ప్రైవేట్ వర్సిటీల విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. కార్యక్రమంలో నీతి అయోగ్ సలహాదారు అన్నరాయ్ పాల్గొన్నారు. కేంద్రం తరుఫున బాధ్యతలు చూస్తున్న నీతి అయోగ్ అధికారులు జీఈఎస్ లోగో ఆవిష్కరించారు. సదస్సు నిర్వహించే హెచ్‌ఐసీసీ, హైటెక్స్, ఫలక్‌నామా ప్యాలెస్‌లను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ పరిశీలించి… సదస్సు వేదిక, వసతిపై సంతృప్తి వ్యక్తంచేశారు.

దక్షిణాసియాలోనే మొదటిసారిగా హైదరాబాద్‌ వేదికగా నిర్వహిస్తున్న ఈ సదస్సు విజయవంతానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్, ఇతర అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందు కోసం కేటీఆర్ నేతృత్వంలో పదకొండు మందితో కమిటీ ఏర్పాటైంది. ప్రతిష్ఠాత్మకమైన సదస్సు కావడంతో ప్రపంచవ్యాప్తంగా వచ్చే పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులకు హైదరాబాద్, తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరించే ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథ్య రాష్ట్రంగా సదస్సులో తెలంగాణకు ప్రత్యేక అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు. దీనితోపాటుగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను చూపించేందుకు కూడా సిద్ధమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. సదస్సు సమయంలో నగరాన్ని సుందరంగా అలంకరించాలని ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించినట్టు తెలుస్తోంది.

అమెరికా ప్రతినిధి బృందానికి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా నాయకత్వం వహిస్తున్నారు. సదస్సు సమయంలో రెండు రోజుల పాటు ఆమె హైదరాబాద్‌లో ఉండనున్నారు. త్వరలోనే అమెరికా ప్రతినిధి బృందం హైదరాబాద్‌కు వచ్చి సదస్సు వేదిక, వసతి, రవాణా ఏర్పాట్లను పరిశీలించనున్నది. సదస్సుకు రానున్న మూడు వేల మంది అహ్వానితుల్లో సగం మంది మహిళలు ఉండేలా చూస్తున్నారుసదస్సుకు వందకుపైగా దేశాలనుంచి మూడు వేలమంది హాజరుకానున్నారు. ఇందులో దాదాపు పదిహేను వందల మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఉంటారని తెలుస్తున్నది. సదస్సుకు హాజరయ్యే అన్ని దేశాల ప్రతినిధులను అమెరికాయే ఖరారుచేస్తుంది. వారికి ఖర్చులను కూడా భరిస్తుంది. భారతదేశ ప్రతినిధులను నీతిఅయోగ్, విదేశీ వ్యవహారాలశాఖ, వాణిజ్య శాఖ సమన్వయం చేస్తాయి.