నదుల అనుసంధానంపై కేంద్రం చర్చ

కేంద్ర జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి నితిన్ గ‌డ్కరీ ఆధ్వర్యంలో 31వ‌ నేష‌న‌ల్ వాట‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ ఏజెన్సీ స‌మావేశం ఢిల్లీలో జరిగింది. రాష్ట్రం నుంచి మంత్రి హ‌రీశ్ రావు, స్పెషల్ చీఫ్ సెక్రట‌రీ ఎస్.కె. జోషితో పాటు వివిధ రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. న‌దుల అనుసంధానంపై ఈ స‌మావేశంలో సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది.

నేష‌న‌ల్ వాట‌ర్ డెవ‌లప్ మెంట్ ఏజెన్సీ స‌మ‌ావేశంలో తెలంగాణ ప్రభుత్వం త‌రఫున ప‌లు అభిప్రాయాల‌ను తెలియ‌జేశామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప‌నితీరును కేంద్రమంత్రి నితిన్ గడ్కరి అభినందించారని తెలిపారు. మిష‌న్ కాక‌తీయ‌, పెద్ద ఎత్తున నీటి పారుద‌ల ప్రాజెక్టుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని ఈ స‌మావేశంలో కేంద్ర మంత్రి ప్రశంసించారని చెప్పారు.

మ‌హాన‌ది, గోదావ‌రిని మొట్టమొద‌ట న‌దుల అనుసంధానం చేయాల‌ని తెలంగాణ ప్రభుత్వం త‌రఫున అభిప్రాయం వ్యక్తం చేశామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఇందుకోసం ఒడిశా ముఖ్యమంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ తో కేంద్ర ప్రభుత్వం చ‌ర్చించి ఒప్పించాల‌ని కోరామన్నారు. రెండు, మూడు రాష్ట్రాల మ‌ధ్య న‌దుల అనుసంధానంలో భిన్న రాష్ట్రాలు, భిన్న పార్టీలు, రాజ‌కీయ ప‌ర‌మైన చిక్కులు ఎదురవుతున్నాయని మంత్రి వివరించారు. ఇంట‌ర్ లింకింగ్ తో పాటు, ఇంట్రా లింకింగ్ పై ఆలోచించాల‌ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు.

ఒకే రాష్ట్రంలోని ఒక చోటు నుంచి నీటిని మ‌రోక చోటుకి తీసుకువెళ్లేలా కేంద్ర ప్రభుత్వం స‌హ‌క‌రించాల‌ని విజ్ఞప్తి చేశామని మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. కృష్ణా న‌ది ప‌రివాహక ప్రాంత‌మైన శ్రీ‌శైలం, నాగార్జున సాగ‌ర్ లో నీళ్లు రాని ప‌రిస్థితి ఉంటే, గోదావ‌రిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయిన తెలిపారు. ఆ నీళ్లను కృష్ణా ప‌రివాహ‌క ప్రాంతంలోకి మ‌ళ్లించేలా కేంద్ర ప్రభుత్వం చొర‌వ చూపాల‌ని కోరామన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి ఉప‌యోగ‌ప‌డే ఇంట్రా లింకింగ్ వ్యవ‌స్థపై రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగానే ఉంటాయన్నారు.

నదుల అనుసంధానంపై రానున్న రోజుల్లో పెద్ద ప్రాజెక్ట్ చేప‌ట్టనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్కరీ తెలిపారు ఈ ప్రాజెక్టులో 90 శాతం కేంద్ర ప్రభుత్వం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ భారాన్ని భ‌రించాల్సి ఉంటుంద‌ని కేంద్ర మంత్రి తెలిపారు.