ధాన్య భాండాగారంగా కామారెడ్డి

కామారెడ్డి జిల్లా ధాన్య భాండాగారంగా అవతరించింది. భారీగా ధాన్యం ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది. గతంలో అంతంత మాత్రంగా ఉండే వరిసాగు.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో దూసుకుపోతోంది. నాణ్యమైన 9 గంటల ఉచిత కరెంటుతో పాటు.. చెరువుల పూడికతీతతో భూగర్భ జలాలు పెరగడం.. ఇలా అన్ని అవకాశాలను అందిపుచ్చుకున్న అన్నదాతలు సాగుచేసి భారీ దిగుబడి సాధించి కామారెడ్డి జిల్లాను అ్రగస్థానంలో నిలిపారు.

పేరుకు నిజాంసాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ గతంలో చుక్కనీరు కూడా ఇక్కడి రైతులకు అందేది కాదు. అందుకే ప్రతీ ఏడు బోర్లపై ఆధారపడి పంటలు పండిస్తారు ఇక్కడి రైతులు. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు, వడగండ్ల వల్ల ధాన్యం ఉత్పత్తి తగ్గేది. ఇక్కడే జిల్లా ప్రజాప్రతినిధులు తమ పనితీరు కనబర్చారు. గత ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నవారిలా హామీలు ఇచ్చి వదిలేయలేదు. ముఖ్యంగా మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఈ విషయంలో అధిక చొరవ చూపారు. రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం, తన సొంత జిల్లాలో రైతన్నలకు నష్టం జరగడంతో అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేశారు. బాన్సువాడ, బీర్కూర్, నసురుల్లాబాద్, గాంధారి, నిజాంసాగర్, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ సత్యనారాయణతో కలిసి నిరంతరంగా పర్యటించి రైతులను పరామర్శించి భరోసా ఇచ్చారు. దాని ఫలితంగానే గత రబీలో వడగండ్ల వాన వల్ల నేలపాలైన ప్రతి ధాన్యం గింజకు పరహారం వచ్చేలా చర్యలు తీసుకున్నారు.

గత రబీలో ఐకేపీ సెంటర్ల ద్వారా 2 లక్షల 21 వేల 336 టన్నుల ధాన్యాన్ని సేకరించిన అధికారులు.. మిల్లింగ్‌ కోసం జిల్లాలో ఉన్న 17 రైస్ మిల్లులకు అప్పగించారు. గతంలో కస్టమ్‌ మిల్లింగ్ కోసం ధాన్యం అప్పగిస్తే.. వ్యాపారులు దర్జాగా వాటిని బ్లాక్ మార్కెట్ కు తరలించేవారు. మిల్లింగ్ కోసం ఇచ్చిన ధాన్యం మొత్తంలో సగభాగం కూడా తిరిగి బియ్యం రూపంలో వచ్చేది కాదు. ఈసారి మాత్రం మంత్రి పోచారంతో పాటు కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ సత్తయ్య చూపిన చొరవతో రాష్ట్రంలోనే కస్టమ్ మిల్లింగ్‌ లో కామారెడ్డి టాప్ పొజిషన్‌ లో నిలిచింది. కేవలం 17 రైస్ మిల్లుల్లోనే లక్ష టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వ గోదాంలకు తరలించారు.

రబీ సీజన్‌ లో అకాల వర్షాల వల్ల నష్టపోయిన అన్నదాతను గాలికి వదిలేయకుండా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. స్వయంగా మంత్రి పోచారం 15రోజుల పాటు ఊరూరా పర్యటించి పంట నష్టం వివరాలను సేకరించి వెంటనే అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయించడంతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. గత ప్రభుత్వాలు హామీలిచ్చి వదిలేశాయని.. కానీ కేసీఆర్‌ సర్కార్‌ మాత్రం అన్నదాతలకు ఇచ్చిన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నదని కొనియాడుతున్నారు.

కామారెడ్డి జిల్లాలో ఉన్న గురు రాఘవేంద్ర రైస్ మిల్ అన్ని ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలుస్తోంది. కెపాసిటీకి మించి మిల్లింగ్ చేయడంలో నెంబర్ వన్‌ గా నిలిచింది. కోతలు లేని కరెంటు సరఫరా చేస్తున్నందునే ఈ ఘనత సాధ్యమైందని మిల్లు యాజమాన్యం పేర్కొన్నది.

మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అన్నదాతలు సంతోషంతో ఉన్నారు. అత్యధిక దిగుబడి వచ్చిన జిల్లాగా కామారెడ్డిని తీర్చిదిద్దడంలో అధికారుల కృషిని కొనియాడుతున్నారు. ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని చెబుతున్నారు.