దిల్‌రాజుపై కేసు నమోదు

మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా స్టోరీని కాపీ కొట్టారనే అభియోగాలపై ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజుపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో మరో నలుగురు సహనిర్మాతలపై కూడా హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు కేసు నమోదుచేశారు. మాదాపూర్‌లో నివాసం ఉండే రచయిత శ్యామలారాణి పలు నవలలు రాస్తుంటారు. 2006లో నా మనసు కోరింది నిన్నే పేరిట ఓ నవల రాశారు. దాని ఆధారంగా సినిమా తీసేందుకు పలువురు చలనచిత్ర నిర్మాతలను ఆశ్రయించినా.. ఎవరూ ముందుకురాలేరు. 2008లో ఆ నవల ప్రతులను సాహితీ పబ్లిషర్స్‌కు అప్పగించగా, వారు పుస్తకం రూపంలో ప్రచురించారు. కొన్నేండ్ల నుంచి అమెరికాలో ఉంటున్న శ్యామలారాణి ఇటీవల నగరానికి తిరిగొచ్చి మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాను చూశారు. తన నవలలోని సన్నివేశాలు, డైలాగులను సినిమాలో వాడుకున్నట్టు గుర్తించారు. తెలుగుతోపాటు తమిళం, మళయాలం, హిందీ, బెంగాళీ భాషల్లో సినిమాను రీమేక్ చేశారని తెలుసుకుని కూకట్‌పల్లి 25వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయమూర్తి ఈ నెల 14న మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమా నిర్మాతలపై కేసు నమోదుచేయాలని మాదాపూర్ పోలీసులను ఆదేశించారు. చిత్ర నిర్మాతలు వీ వెంకట రమణారెడ్డి అలియాస్ దిల్‌రాజు, శిరీశ్, లక్ష్మణ్, కొండపల్లి దశరథ్, అబ్బూరి రవిపై ఐపీసీ 120 ఏ, 415, 420, 60 సీఏల కింద కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు మాదాపూర్ పోలీసులు తెలిపారు.