దినకరన్ కు సుప్రీంలో చుక్కెదురు

అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్‌ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన ఫెరా కేసులో మూడు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దినకరన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఐతే ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించలేమంటూ….దినకరన్‌ అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

2001లో ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నమోదుచేసిన ఫెరా కేసులో దినకరన్‌ పై ఇప్పటికే ఎగ్మూరు అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు అభియోగాలు ఖరారు చేసింది. ఫెరా చట్టంలోని పలు నిబంధనలు ఉల్లంఘించి…. ఆర్బీఐ అనుమతి లేకుండా  విదేశీ డాలర్లు కోటి 4 లక్షల 93వేల 313 డాలర్ల అక్రమ లావాదేవీలను దినకరన్‌ నిర్వహించి.. బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్‌ లోని డిప్పర్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌ లిమిటెడ్‌ లోకి తరలించినట్టు ఈడీ అభియోగాలు మోపింది. 36 లక్షల 36వేల డాలర్లు, లక్ష పౌండ్ల అక్రమ లావాదేవీలు విదేశాల్లో నిర్వహించినట్టు ఈడీ మరో కేసు కూడా దినకరన్‌ పై పెట్టింది. ఈ రెండు కేసులకు సంబంధించి ఊరట కోసం దినకరన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఎదురుదెబ్బ తగిలింది.

మరోవైపు పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దినకరన్‌ తన వర్గం ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. ఇద్దరు అన్నాడీఎంకే ఎంపీలు ఇవాళ దినకరన్ ను కలిశారు.