తొలి టీ-20లో పాక్‌ విజయం

ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ స్టార్‌ ఆటగాళ్లు తమ దేశంలో ఆడేందుకు వచ్చారన్న జోష్‌లో పాకిస్థాన్‌ అదరగొట్టింది. ఇండిపెండెన్స్‌ కప్‌లో భాగంగా వరల్డ్‌ లెవెన్‌పై అద్భుత విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లాహోర్‌లో జరిగిన తొలి టీ20లో పాక్‌ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. విజయంతో సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఉత్కం ఠగా సాగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సర్ఫ్‌రాజ్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 197 పరుగులు చేసింది. బాబర్‌ ఆజమ్‌ (52 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 86) ధనాధన్‌ ఆటతో చెలరేగాడు. అహ్మద్‌ షెహజాద్‌ (39), షోయబ్‌ మాలిక్‌ (38) రాణించారు. వరల్డ్‌ లెవెన్‌ బౌలర్లలో తిసార పెరీర రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన డుప్లెసిస్‌ నేతృత్వంలోని వరల్డ్‌ లెవెన్‌ ఓవర్లన్నీ ఆడి ఏడు వికెట్లకు 177 పరుగులు మాత్రమే చేసింది. డారెన్‌ సామి (29 నాటౌట్‌), డుప్లెసిస్‌ (29), హషీమ్‌ ఆమ్లా (26), టిమ్‌ పెయిన్‌ (25) పోరాడినా ఫలితం లేకపోయింది. పాక్‌ బౌలర్లలో సొహైల్‌ ఖాన్‌, రమన్‌ రయీస్‌, షాదాబ్‌ ఖాన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.