తెలంగాణ ప్రభుత్వ కృషి ఆదర్శనీయం

భూమిపై పచ్చదనం పెంచడానికి, నదీ జలాలను సద్వినియోగం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ఆదర్శనీయమని కేంద్ర అటవీశాఖ ప్రధానాధికారి (డీజీ-ఫారెస్ట్స్) సిద్ధాంత దాస్ ప్రశంసించారు. నీళ్లున్న చోటనే చెట్లు పెరుగుతాయని, అడవులున్న చోటనే వర్షాలు పడతాయని, నీటికి చెట్టుకు విడదీయరాని సంబంధం ఉందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని గుర్తెరిగి తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని, సమర్థ నీటి వినియోగ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని అభినందించారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిద్ధాంత దాస్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య నీటి పారుదల ప్రాజెక్టులు, పచ్చదనం పెంచడానికి చేపడుతున్న కార్యక్రమాలపై చర్చ జరిగింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండో వారం నుంచే అడవుల పునరుద్ధరణకు, సామాజిక అడవుల పెంపకానికి చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధాంత దాస్ కు వివరించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు పెంచడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 4వేల నర్సరీలున్నాయని, వచ్చే ఏడాది నుంచి ప్రతీ గ్రామ పంచాయతీలో ఒక నర్సరీ ఏర్పాటు చేస్తామన్నారు. భావి తరాలకు పచ్చదనం పెంచడంపై అవగాహన కల్పించేందుకు వచ్చే సంవత్సరం నుంచి పాఠ్యాంశాల్లో హరితహారం కార్యక్రమాన్ని ఓ పాఠ్యాంశంగా చేర్చనున్నట్లు సీఎం వెల్లడించారు.

గోదావరి, కృష్ణా నదులు తెలంగాణ రాష్ట్రానికి ఇరువైపులా పారుతున్నా.. వాటిని వినియోగించుకోవడానికి ప్రాజెక్టులు లేవని, అందుకోసమే తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. మిషన్ కాకతీయ పేరుతో 46 వేల చెరువులను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. వీటివల్ల వాతావరణంలో తేమశాతం పెరగడంతో పాటు భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ఈ వాతావరణం చెట్లు పెరగడానికి ఎంతో దోహదం చేసిందని సీఎం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం చూపిస్తున్న చొరవకు కేంద్రం నుంచి సహకారం అందించాలని సిద్ధాంత దాస్ ని కోరారు.

మంత్రులు హరీష్ రావు, జోగు రామన్న, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు కూడా ఈ భేటీలో ఉన్నారు.