తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది

తెలంగాణ అంటే అభివృద్ధి! అభివృద్ధి అంటేనే తెలంగాణ! అది ఏ రంగమైనా సరే.. కొత్త రాష్ట్రం తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధిస్తోంది. తాజాగా అసోచాం సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైంది. దక్షిణ భారతదేశంలోనే తెలంగాణ 79 శాతం వృద్ధితో నంబర్ వన్‌గా నిలిచింది.

టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాలతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంది. టీఎస్ ఐపాస్‌, సింగిల్ విండో అనుమతులు లాంటి విధానాలతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా తరలి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాల కన్నా అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్తోందని అసోచాం వెల్లడించింది. దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో 79 శాతం వృద్ధితో ముందుందని తెలిపింది. ఒక్క 2017 సంవత్సరంలోనే రాష్ట్రంలోకి 5.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు వివరించింది. తెలంగాణ ఆర్థిక అభివృద్ధి, పెట్టబుడుల విధానంపై అసోచాం ఇండియా ఒక సర్వే నిర్వహించింది. అసోచాం ఇండియా సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ సర్వే వివరాలను హైదరాబాద్‌ లో వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాలతో రాష్ట్రానికి దేశ, విదేశీ కంపెనీలు క్యూ కడుతున్నాయని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాలతో పాటు ఇరిగేషన్ రంగంలో కూడా భారీ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని అసోచాం తెలిపింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో చిన్నతరహా, భారీ పరిశ్రమలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ పాలసీయే కారణమని డీఎస్ రావత్ వివరించారు. 2017కి గాను ఇరిగేషన్ రంగంలో 27.8 శాతం  పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. సేవా రంగంలో 23.01 శాతం, విద్యుత్ రంగంలో 18.5 శాతం, ఉత్పాదక రంగంలో 11.01 శాతం పెట్టుబడులు పెరిగినట్టు సర్వేలో తేలిందని రావత్ వెల్లడించారు.

రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించబోతోందని అసోచాం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి, పట్టుదల వల్లే ఇంతటి ప్రగతి సాధ్యమైందని కొనియాడింది.