తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు

తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఇన్వెస్ట్‌ ఇండియా కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇన్వెస్ట్‌ ఇండియా సీఈవో దీపక్‌ బాగ్వా, సంస్థ ఉపాధ్యక్షులు దుశ్యంత్‌ ఠాకూర్‌ తో భేటీ అయ్యారు. ఐటీ, పరిశ్రమల రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతున్న తీరును వారికి మంత్రి కేటీఆర్‌ వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ-హబ్‌, టీఎస్‌ ఐపాస్‌లపై.. తైవాన్‌ ఇన్వెస్టర్ల బృందానికి కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఇన్వెస్ట్‌ ఇండియా అనేది గొప్ప ఆలోచన అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. భారత్‌ ఎప్పుడూ ఆశావహ దృక్పథంతో ఉంటుందని తెలిపారు. భిన్న రాష్ట్రాలు, రాజకీయ పరిస్థితుల మధ్య మరింత సమన్వయం అవసరమని కేటీఆర్‌ అన్నారు. గతేడాది ఇన్వెస్ట్ మెంట్‌ ప్రమోషన్‌ ఏజెన్సీ.. ప్రపంచంలోనే భారత్‌కు నెంబర్‌ వన్‌ స్థానం  కల్పించిందని గుర్తుచేశారు. కేటీఆర్‌ ప్రజెంటేషన్‌తో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బహుళజాతి కంపెనీలు సుముఖత వ్యక్తం చేశాయి.ఢిల్లీలో ఉన్న కేటీఆర్‌.. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజుతో భేటీ అయ్యారు. పౌరవిమానయాన శాఖ వద్ద రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌ లో ఉన్న అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో విమానయాన రంగానికి సహకరించాలని కోరారు.