టీ-రేషన్ యాప్ ను ప్రారంభించిన పౌరసరఫరాల శాఖ

రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖలో పెరుగుతున్న అవినీతిని అంతం చేసే దిశగా భారీ ప్రణాళికలు రచిస్తోంది తెలంగాణ పౌరసరఫరాల శాఖ. ఇప్పటికే టెక్నాలజీని ఉపయోగించి ఈ పాస్ సిస్టమ్స్అమలు చేయగా… ప్రస్తుతం  టీ-రేషన్ పేరుతో యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను నేడు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించనున్నారు. ఈ యాప్‌ ద్వారా దగ్గరలోని రేషన్‌ షాపు, షాపులో ఉన్న సరుకు వివరాలు అరచేతిలో అందుబాటులో ఉండనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ వివరాలను అధికారులు కూడా క్షణాల్లో చూసుకునే అవకాశం ఉండనుంది.

 ఈ యాప్‌లో రేషన్‌ కార్డు నెంబర్ నమోదు చేయడం వల్ల… కార్డులోని సభ్యుల వివరాలు, అడ్రస్, రేషన్ షాపు వివరాలతో పాటు కార్డు ఉందా, తొలగించబడిందా వంటి తాజా స్థితిని తెలుసుకోవచ్చు. కార్డుకు సంబంధించిన ఏ విధమైన సమాచారాన్నై యాప్ ద్వారా సులభంగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఏ షాపులో ఎంత స్టాక్ ఉంది, ఒక్కో రేషన్ కార్డుకు ఎంత సరుకు కేటాయించారు, ఈ పాస్ మిషన్ ద్వారా ఎంత లవాదేవీలు జరిగాయి అనే వివరాలు తెలుస్తాయి. అయితే,.. ఈ-పాస్ యాక్సిస్ ఉన్న షాపులకు మాత్రమే టీ-రేషన్‌ యాప్‌ను వినియోగించుకునే వీలుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 14 జిల్లాల్లోని  8,546 షాపుల్లో మాత్రమే ఈ-పాస్ ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నారు. మిగతా జిల్లాలకు అక్టోబర్ నాటికి అన్ని జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు అధికారులు.

ఈ యాప్ ద్వారా వంద శాతం పారదర్శకత సాధ్యమవుతుందని భావిస్తున్నామన్నారు పౌరసరఫరాల కమిషనర్ సీవీ ఆనంద్‌. యాప్‌లో అన్ని రకాల ఫీచర్లను పొందుపరిచామన్నారు. యాప్‌ను మరింత డెవలప్ చేసి.. గోదాము నుంచి వెళ్లిన సరుకు వాహనాల స్టేటస్‌ తెలుసుకునే అవకాశం కల్పిస్తామన్నారు ఆనంద్.