టీచర్ పోస్టుల భర్తీకి సర్వం సిద్ధం

పాఠశాల విద్యాశాఖలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకోసం అక్టోబర్‌లో నోటిఫికేషన్ విడుదలకానుంది. దీనికి సంబంధించి డి ప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలో పాఠశాల విద్యాశాఖ సన్నాహాలుచేస్తున్నది. విద్యాశాఖలో 8,792 టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో నియామక నిబంధనలను రూపొందించడంలో కడియం నిమగ్నమయ్యారు. ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ద్వారా టీచర్‌పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేయాల్సి ఉన్నప్పటికీ కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో తలెత్తుతున్న న్యాయపరమైన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. అందుకోసం న్యాయశాఖ, సాధారణ పరిపాలన శాఖ ఉన్నతాధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు.

టీచర్ల భర్తీ ప్రక్రియను పాత జిల్లాల ప్రకారం చేపట్టాలా? లేక 31 జిల్లాల ప్రకారమా? అన్న అంశంపై స్పష్టతకోసం ఇప్పటికే అడ్వకేట్ జనరల్‌కు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, విద్యాశాఖ ఉన్నతాధికారులు లేఖలు రాశారు. ఈ అంశంపై కోర్టులో దాఖలైన కేసుకు పరిష్కారం చూపడంపై సాధారణ పరిపాలనశాఖ, న్యాయశాఖ ఆధ్వర్యంలో కసరత్తు కొనసాగుతున్నది. కొత్తగా ఏర్పాటైన 31 జిల్లాల ప్రకారం టీచర్ పోస్టులను భర్తీ చేయాలనుకుంటే.. కొత్త జిల్లాల్లోని జిల్లా క్యాడర్ పోస్టులను లోకల్ క్యాడర్ చేయాల్సి ఉందని, ఈ నేపథ్యంలో పాత పది జిల్లాల ప్రకారం టీచర్ పోస్టులను భర్తీ చేయడానికే న్యాయశాఖ, సాధారణ పరిపాలన శాఖ మొగ్గుచూపుతున్నదని డిప్యూటీ సీఎం కడియం భావిస్తున్నారు.

ప్రస్తుతం బీఎడ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కూడా అక్టోబర్‌లో విడుదల కానున్న నోటిఫికేషన్‌కు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నది. బీఎడ్ రెండో సంవత్సరం ఫలితాలు అక్టోబర్‌లోనే విడుదల కానున్నాయి. నోటిఫికేషన్ నాటికి బీఎడ్ విద్యార్థులు ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన ఉన్నది. డీఎస్సీ నియామక నిబంధనల ప్రకారం బీఎడ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులను టీచర్ ఉద్యోగాల భర్తీ రాత పరీక్షలకు అనుమతించాల్సి ఉంది. అయితే వారిలో టీఎస్ టెట్‌లో అర్హత సాధించిన వారు దాదాపు 25 వేలమంది వరకు ఉన్నారని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. ఇలాంటి పలు సహేతుకమైన కారణాలవల్ల నోటిఫికేషన్‌ను అక్టోబర్‌లో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

వచ్చేనెలలో విడుదలకానున్న నోటిఫికేషన్‌కు సంబంధించి నిర్వహించనున్న రాత పరీక్ష సిలబస్‌ను ఎన్సీఈఆర్టీ ద్వారా రూపొందించారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి  నిబంధనల ప్రకారం టీచర్ నియామకాల నోటిఫికేషన్‌ను విడుదలచేయనున్నారు. జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్ల విధానాన్ని కూడా తయారుచేశారు. నియామక ప్రక్రియలో భాగంగా.. ఏ ప్రాంతం వారికీ అన్యాయం జరుగకుండా, భవిష్యత్తులో ఎలాంటి న్యాయపర సమస్యలు తలెత్తకుండా అన్ని కోణాల్లో ఆలోచించి, నోటిఫికేషన్‌ను విడుదలచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.