జీఎస్టీ రిటర్నుల గడువు పొడిగింపు

వస్తు, సేవా పన్ను(జీఎస్టీ) కింద వ్యాపారవేత్తలు దాఖలు చేసే రిటర్నుల తుది గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. జూలై నెలకుగాను విక్రయ రిటర్నులు లేదా జీఎస్టీఆర్-1 దాఖలును ఈ నెల 10 లోగా చేసుకోవచ్చు. గతంలో ఈ గడువు ఐదు వరకు మాత్రేమే ఉండేది. అలాగే కొనుగోలు రిటర్నులు లేదా జీఎస్టీఆర్-2 తుది గడువును ఈ నెల 10 నుంచి 25కి పెంచింది. అలాగే జీఎస్టీఆర్-3 వారు ఈ నెల 30లోపు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఈ నెల 15 వరకే అనుమతి ఉండేది. జీఐసీ(జీఎస్టీ అమలు చేసే కమిటి)..జీఎస్టీఆర్-1, జీఎస్టీఆర్-2, జీఎస్టీఆర్-3 గడువులను పొడిగిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆగస్టు నెలకుగాను జీఎస్టీఆర్-1 గడువును అక్టోబర్-5కి, జీఎస్టీఆర్-2ని వచ్చే నెల 10కి, జీఎస్టీఆర్-3ని అక్టోబర్ 15 వరకు పొడిగించింది. జీఎస్టీ రిటర్నుల గడువును పెంచాలని వ్యాపార వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇందుకు సంబంధించి త్వరలో కేంద్రం నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నది.