జిల్లాల్లో వైభవంగా నిమజ్జనోత్సవం

రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ శోభాయాత్రలు ధూంధాంగా జరుగుతున్నాయి. బాజా, భజంత్రీలు.. మేళతాళాలు, బ్యాండ్, డప్పుల మోతల నడుమ వినాయకుడిని ఊరేగిస్తున్నారు. డప్పుచప్పుళ్లకు అనుగుణంగా చిన్నాపెద్ద, ఆడామగా తేడా లేకుండా నృత్యాలు చేస్తూ సందడి చేస్తున్నారు. వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. గణపతి బప్పా మోరియా.. అగ్‌ లె బరస్ తూ జల్దీ ఆ.. అన్న నినాదాలతో వీధులు, రోడ్లు మారుమ్రోగుతున్నాయి.

నిర్మల్‌ జిల్లా కేంద్రం బుధవారు పేట గణేష్ నిమజ్జన శోభయాత్రలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పాల్గొన్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి.. శోభయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి నృత్యం చేశారు.

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో డప్పు వాయిద్యాలు, భక్తుల సాంప్రదాయ నృత్యాల మధ్య గణేష్‌ నిమజ్జనం కన్నుల పండువగా సాగుతోంది. వినాయక చౌక్‌ లో విఘ్నేశ్వరుడి  శోభయాత్రను మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. ఏకదంతుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం…కొబ్బరికాయ కొట్టి శోభాయాత్రను మొదలుపెట్టారు. ఈ శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న జనం.. గణపతి బొప్పా మోరియా అంటూ గణేషుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఎంపీ నగష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లా బిచ్కుందలో గణేశ్‌ శోభాయాత్ర ధూంధాంగా జరుగుతోంది. ఎమ్మెల్యే హన్మంతు షిండే జెండా ఊపి గణేశ్ శోభాయాత్రను ప్రారంభించారు. అంతకుముందు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి, భజన కార్యక్రమంలో పాల్గొన్నారు.