జియో@13 కోట్ల కస్టమర్లు

రిలయన్స్‌ జియో దేశీయంగానేకాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులు సృష్టిస్తోందని, టెలికాం సర్వీసులు ప్రారంభించిన ఏడాది కాలంలోనే 13 కోట్లకుపైగా కస్టమర్లను సంపాదించుకుందని రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముకేష్‌ అంబానీ తెలిపారు. ఈ మేరకు ఆయన సంస్థ ఉద్యోగులకు ఒక లేఖ రాశారు. ‘‘గత ఏడాది కాలంలో మనం దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులను బద్దలు కొట్టాం. భారత్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా లేదన్న భ్రమలు ఉండేవి. కానీ ఈ భ్రమలు పటాపంచలుకావడం నాకు వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తిని ఇస్తోంది’’ అని అంబా నీ లేఖలో పేర్కొన్నారు. జియో ఈ స్థాయిలో విజయవంతం కావడానికి ఉద్యోగులు ఎంతగానో కృషి చేశార న్నారు. మనమంతా కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఎండ్‌ టు ఎండ్‌ ఐపి 4జి నెట్‌వర్క్‌ను సృష్టించగలిగామని, భారత్‌ జియోను సొంతం చేసుకుందని పేర్కొన్నారు. జియో నెట్‌వర్క్‌పై భారీ స్థాయిలో డేటా వినియోగం పెరగడమేకాకుండా కస్టమర్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందిందన్నారు. రిలయన్స్‌ జియో తన మొబైల్‌ సర్వీసులను గత ఏడాది సెప్టెంబర్‌ 5వ తేదీన ప్రారంభించారు.