జలాశయాలు కళకళ

రాష్ట్రంతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. జలాశయాలన్నీ నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 147.20 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు అయితే.. ఇప్పుడు 17.952 టీఎంసీల నీరుంది. ఎల్లంపల్లిలో 8 వేల 190 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో, 465 క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో కొనసాగుతోంది.

నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 643.70 అడుగులుగా రికార్డైంది. ఇన్‌ ఫ్లో వెయ్యి క్యూసెక్కులు ఉంటే.. ఔట్‌ ఫ్లో 200 క్యూసెక్కులు ఉంది. అటు జూరాలకు కూడా వరద నీరు భారీగా పెరిగింది. పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 318.500 మీటర్లుగా ఉంది. 9.657 టీఎంసీల సామర్థ్యం గల జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 9.624 టీఎంసీల నీరుంది. ప్రాజెక్టులోకి 95 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 13 గేట్లు ఎత్తి 94 వేల 794 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

కుమ్రం భీం ప్రాజెక్టులోకి కూడా వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 238.850 మీటర్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 10.393 టీఎంసీలు అయితే.. ప్రస్తుత నీటి మట్టం 6.699 టీఎంసీలుగా నమోదైంది. కుమ్రం భీం ప్రాజెక్టులోకి 18 వేల 11 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో కొనసాగుతోంది. ఇటు నిజాంసాగర్‌ లో నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1387.50 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం 3.123 టీఎంసీల నీరుంది. ఇన్‌ ఫ్లో 880, ఔట్‌ ఫ్లో 252 క్యూసెక్కులుగా ఉంది.

శ్రీశైలం ప్రాజెక్టు విషయానికొస్తే.. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 840.75 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 215.807 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం 62.94 టీఎంసీలు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి  64,780 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో, 2613 క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో కొనసాగుతోంది. అటు నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 500.90 అడుగులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.040 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 116.733 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్‌ నుంచి 800 క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో కొనసాగుతోంది.