జలఖడ్గాన్ని తలపించిన ఇర్మా హరికేన్

ఇర్మా తూఫాన్ శాంతించినట్లే కనిపిస్తున్నది. ఫ్లోరిడా తీరాన్ని తాకే సమయంలో క్యాటగిరీ-4 లో ఉండి భయపెట్టిన తుఫాన్ క్యాటగిరీ -1కి బలహీనపడింది. టాంపా ప్రాంతానికి ఉత్తరంగా 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుఫాన్ ఫ్లోరిడా వాయువ్య తీరంవైపు కదులుతున్నది. తుఫాను దిశను మార్చుకోవడంతో పెనుముప్పు తప్పినట్లేనని అంచనా వేస్తున్నప్పటికీ……..ఏ క్షణాన్నైనా ప్రమాదకరంగా పరిణమించవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గంటకు 70 మైళ్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఒకవేళ ఇర్మా హరికేన్ ఫ్లోరిడా ఉత్తర ప్రాంతానికి గాని ,జార్జియా దక్షిణ ప్రాంతానికి గాని కదిలితే , అది ఉష్టమండల తుఫాన్‌గా మారుతుంది. ఇర్మా కారణంగా ఇప్పటికే 63 లక్షల మంది ప్రజలు ఫ్లోరిడాను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద తరలింపు . ఇర్మా బలహీనపడినప్పటికీ ఫ్లోరిడాపై దాని ప్రభావం తీవ్రంగా ఉందని అధికార యంత్రాంగం హెచ్చరిస్తున్నది.

ఏటవాలు తీరం వెంబడి పయనిస్తున్న ఇర్మా తుఫాన్ సుడులు తిరుగుతూ ప్రజలు అధికంగా నివసించే టాంపా తీర ప్రాంతం వైపు కదులుతున్నదని మియామిలోని నేషనల్‌ హరికేన్ సెంటర్ ప్రకటించింది. ఫ్లోరిడాను తాకిన తొలిరోజే తుఫాన్ ముగ్గురిని బలిగొన్న విషయం తెలిసిందే. పెనుగాలులకు వందలాది ఇండ్లు ద్వంసమయ్యాయి. వేల సంఖ్యలో భారీ వృక్షాలు,స్థంభాలు నేలకూలాయి. పదివేల కోట్ల వరకు ఆస్తినష్టం ఉండవచ్చని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది.

ఫ్లోరిడాలోని 45 లక్షల ఇండ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుఫాన్ వెళ్లేవరకు విద్యుత్‌ను పునరుద్ధరించలేమని …కొన్ని వారాల సమయం పడుతుందని ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. జార్జియాలో సుమారు లక్షమంది అంధకారంలోనే ఉన్నారు. వరుసగా హార్వీ, ఇర్మా హరికేన్ల కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ రెండు హరికేన్ల కారణంగా ఇప్పటికే 18 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ఇది మరింత పెరగవచ్చని చెబుతున్నారు.

ఐతే తాము తూర్పు తీరంలో ఉండటంతో  ఇర్మా విషయంలో ఎంతో లక్కీ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఇర్మా ఎఫెక్ట్ కు సంబంధించి ఎప్పటికప్పుడు ఆయన సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ నుంచి కోలుకోవటానికి చాలా సమయం పడుతుందన్నారు. అలాబమా, జార్జియా, దక్షిణ కరోలినా, టెన్సెస్సే గవర్నర్లతోనూ ఆయన చర్చించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలని వారికి సూచించారు. నష్టపోయిన ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్ని వేగవంతం చేయాలని హోం ల్యాండ్, ఆర్మీ, అత్యవసర విభాగాల్ని ఆదేశించారు. అటు టాంపా ప్రాంతానికి ఉత్తర దిశన కేంద్రీకృతమైన తుఫాన్ బలహీనపడింది. ఉష్ణమండల తుఫాన్‌గా మారనున్న ఇర్మా క్యాటగిరీ -1 లో చేరినప్పటికీ ,అనూహ్యంగా దిశను మార్చుకుంటున్నందున ఏ క్షణాన్నైనా ప్రమాదకరంగా పరిణమించవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.