జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం పెద్దపీట వేస్తున్నారు

తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదన్నారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలోను భాగస్వాములు అవుతున్నందుకు అభినందించారు. వరంగల్ లో తెలంగాణ మీడియా అకాడమీ ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కడియం చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 16 వేల మందికి అక్రిడేషన్ లు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెల్త్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.60 కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్ దని, మరో 40 కోట్లు కేటాయిస్తే 100 కోట్లకు చేరుతుందన్నారు. వ్యతిరేక వార్తలు రాస్తేనే గుర్తింపు వస్తుంది అనుకోవడం సరికాదని డిప్యూటీ సీఎం కడియం అభిప్రాయపడ్డారు. వాస్తవ పరిస్థితులను ప్రచురించాలన్నారు. నిజమైన వార్తలు రాసినపుడు జర్నలిస్టులకు కొన్ని ఒడిదుడుకులు వస్తాయని, జర్నలిజం గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.

సామాన్య ప్రజల వల్లే ప్రజాస్వామ్యం కాపాడబడుతుందని కడియం అన్నారు. తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని, తాను రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి జర్నలిస్టులే కారణమని చెప్పారు. నాడు తెల్ల కాగితంలా ఉన్న నన్ను జర్నలిస్టులు ప్రోత్సహించారని, ఎప్పటికి తెల్ల కాగితం లాగే ఉన్నానని తెలిపారు. తన సింప్లిసిటీలో మార్పు వచ్చిందేమో కానీ… సిన్సియారిటీ ఎలాంటి మార్పు రాలేదని కడియం స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.