జమ్మూకశ్మీర్ పోలీసులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్

జమ్మూకశ్మీర్ పోలీసులతో పాటు అక్కడ విధుల్లో ఉన్న జవాన్లకు త్వరలోనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అందజేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి జమ్మూకశ్మీర్ వెళ్లిన ఆయన.. అనంత్ నాగ్ లో మీడియాతో మాట్లాడారు. త్వరలోనే అన్ని పోలీసు స్టేషన్లకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సమకూర్చుతామని వెల్లడించారు. ఇందుకు అవసరమైన నిధులను కేంద్రం కేటాయిస్తుందని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాలను రాజ్ నాథ్ పరామర్శించారు. పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివన్న ఆయన.. జమ్మూకశ్మీర్ పోలీసుల ధైర్యం గొప్పదన్నారు. పోలీసుల త్యాగాల గురించి చెప్పడానికి మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.