జనవరి 31 నుంచి మేడారం జాతర

2018 జనవరి 31 నుండి-ఫిబ్రవరి 3 వరకు మేడారం సమ్మక్క సరక్క జాతర జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. గత సంవత్సరం కోటి మంది భక్తులు జాతరకు హాజరయ్యారని, ఈ ఏడాది కోటి 20 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మేడారం జాతర ఏర్పాట్లపై జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆయన సమీక్ష జరిపారు.

మేడారం జాతరకు జనవరి 15 లోపు అన్ని పనులు పూర్తి చేయాలని నిర్ణయించినమని కడియం శ్రీహరి చెప్పారు. ఇక నుంచి పనుల పురోగతి, ఏర్పాట్లపై సమీక్షించుకునేందుకు ప్రతి నెలకోసారి సమావేశం కావాలని నిర్ణయించామన్నారు. జాతర ఏర్పాట్ల కోసం రూ.104 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చారని, అవసరం అయితే ఎక్కువ నిధులు ఇచ్చి భక్త్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామన్నారు. తెలంగాణలో జరిగే పండగ, జాతరలకు ఇబ్బందులు జరుగకుండా చూసేందుకు సీఎం కేసీఆర్ తమకు ఆదేశాలు ఇచ్చారని కడియం వెల్లడించారు. మేడారం సమక్క-సారాలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని తీర్మానం చేశామని, ఈ తీర్మానాన్ని సీఎం కేసీఆర్ కి అందజేసి కేంద్రం నుండి నిధులు ఇవ్వాలని కోరుతామని కడియం తెలిపారు.