ఘనంగా ప్రారంభమైన జపాన్ ప్రధాని పర్యటన

జపాన్ ప్రధాని షింజో అబే రెండు రోజుల భారత పర్యటన గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ప్రధాని నరేంద్రమోడీ షింజో అబే దంపతులకు ఘన స్వాగతం పలికారు. అహ్మదాబాద్‌ లోని సబర్మతి ఆశ్రమంలో షింజో దంపతులతో కలసి ప్రధాని మోడీ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గైడ్ గా మారిపోయారు. గాంధీజీ జీవిత విశేషాలను, సబర్మతి ఆశ్రమం విశిష్టతను షింజో దంపతులకు స్వయంగా వివరించారు. ఆశ్రమం మొత్తాన్ని షింజో దంపతులకు దగ్గరుండి చూపించారు. సబర్మతి తీరంలో కాసేపు సేద తీరారు. గాంధీజీ జీవిత విశేషాలను తెలుసుకోవటం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా షింజో అబే సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అహ్మదాబాద్ లోని 16వ శతాబ్ధానికి చెందిన ప్రఖ్యాత సిది సయ్యిద్ ని జాలి మసీదుని సందర్శించారు.

అంతకుముందు అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో స్వయంగా ప్రధాని మోడీయే జపాన్‌ ప్రధాని దంపతులకు ఘనస్వాగతం పలికారు. ప్రోటోకాల్‌ ను పక్కన బెట్టి షింజో దంపతులకు మోడీ స్వాగతం పలకటం విశేషం. ఆ తర్వాత ఎయిర్ పోర్ట్ నుంచి సబర్మతి ఆశ్రమం వరకు 8 కిలోమీటర్ల దూరం ర్యాలీగా వెళ్లారు. షింజో అబే, ఆయన భార్య అఖి భారతీయ దుస్తులు ధరించి ఓపెన్ టాప్ జీప్‌ లో ప్రధాని మోడీతో దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లారు. ఈ సందర్భంగా రోడ్డు పొడువునా భారతీయ సంస్కృతి ఉట్టి పడేలా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఓ విదేశీ ప్రధాని భారత్‌ లో ఇలా రోడ్‌ షో లో పాల్గొనటం ఇదే ప్రథమం. మోడీ ప్రధాని అయ్యాక షింజో అబే భారత్‌ లో పర్యటించటం ఇది నాలుగోసారి.

రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్న షింజో అబే… రేపు (గురువారం) అహ్మదాబాద్‌-ముంబై మధ్య ఏర్పాటు చేయనున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టి ఈ ప్రాజెక్టును జపాన్ పూర్తి చేయనుంది. ఆర్థిక సహాయం కూడా జపాన్‌ ప్రభుత్వమే అందజేయనుంది.