ఘనంగా కాళోజీ జయంతి వేడుక

ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణ రావు 103 వ జయంతి ఉత్సవం, తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన ఈ వేడుకల్లో  హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎంపీలు బిబి పాటిల్, బండారు దత్తాత్రేయతో పాటు ప్రభుత్వ సలహాదారు రమణాచారి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఎస్వీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  కవి సీతారాం ను కాళోజీ పురస్కారం, జ్ఞాపికతో పాటు లక్షా వెయ్యి నూట పదహారు రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ఇచ్చి సన్మానించారు.

కాళోజీ కలలు కన్న తెలంగాణను సాధించటమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ముందుకెళుతోందని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పారు.  కాళోజీతో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. ఉద్యమ కాలంలో కాళోజీతో కలిసి పనిచేసే అవకాశం దొరకటం తన అదృష్టం అని అన్నారు. కాళోజీ మాటలే కవిత్వం అని, ప్రభుత్వ అవకతవకలను ఎదిరించి ప్రజలకు అండగా ఉన్న వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. సాధించుకున్న తెలంగాణలో ఆయన లేకపోవడం తీరని లోటని అన్నారు. కాళోజీ ఎప్పుడూ ఇక్కడి ప్రజల కోసం పరితపిస్తూ ఉండేవాడని, తెలంగాణ అంటే ఆయనకు అమితమైన ఇష్టం అని తెలిపారు. తెలంగాణ ప్రజల నాడి తెలిసిన వ్యక్తి కాళోజీ అని నాయిని వివరించారు.

కాళోజీని గుర్తు చేసుకోవడం అంటే మనలను మనమే గుర్తు చేసుకోవడం అన్నారు మండలి చైర్మన్ స్వామి గౌడ్. ప్రజా సమస్యలను కవిత్వం రూపంలో ప్రభుత్వాలకు తెలిపేవారని, ప్రజా సమస్యల నుండే కాళోజీ కవితలు పుట్టాయని అన్నారు.

గాంధీజీ తన ఆత్మకథలో గ్రామీణ వ్యవస్థను రాయడానికి కాళోజీ ప్రేరణగా నిలిచారని గుర్తుచేశారు. ప్రతి గ్రామంలో తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని, కాళోజీ కలలను సాకారం చేసే దిశగా మనమందరం ముందుకెళ్లాలని స్వామి గౌడ్ సూచించారు.

సీతారాం కు కాళోజీ పురస్కారం రావటంతో రెండు రాష్ట్రాల్లోని కవులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి చెప్పారు. ఉద్యమకాలంలో కూడా సీతారాం ఎన్నో కవితలు రాశారని తెలిపారు. నవీనయుగంలో ప్రజల కష్టాలను మన మనసులు తట్టిలేపేలా సున్నిత పదజాలంతో కవిత్వాలు రాయటంలో సీతారాం నేర్పరని సిధారెడ్డి ప్రశంసించారు.

కాళోజీ గురించి చెప్పటం అంటే మన గురించి మనమే చెప్పుకోవడం అని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ అన్నారు. ప్రధాని నుంచి ముఖ్యమంత్రి వరకు అందరికి సన్నిహితుడైనా.. సామాన్యమైన గాంధేయ జీవితం గడిపిన కవియోధుడు కాళోజీ అని కొనియాడారు.

దర్శనీయ కవులలో ఒకరు కాళోజీ నారాయణ రావు, ఇంకొకరు మఖ్దూం మొయినుద్దీన్ అని చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఎస్వీ సత్యనారాయణ.  ఓరుగల్లు  దర్శనీయ ప్రదేశాల్లో ఒకటి వెయ్యి స్తంభాల గుడి అయితే.. రెండోది కాళోజీ నివాసం అన్నారు.

పీడన, అణచివేత, దుర్మార్గం, దౌర్జన్యం, దోపిడీ తొలిగిపోయి మనిషిగా జీవించాలని ప్రతి ఒక్కరికి చెప్పిన కవి కాళోజీ అని కాళోజీ పురస్కార గ్రహీత సీతారాం అన్నారు. ఇంతటి గొప్ప అవార్డుకు తనను ఎంపిక చేయటం తన అదృష్టం అని సంతోషం వ్యక్తం చేశారు.  ఈ అవార్డుతో తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ అవార్డును తన తోటి అధ్యాపకులకు అంకితం ఇస్తున్నానని సీతారాం ప్రకటించారు. తనను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

కాళోజీ పురస్కారాన్ని 2015లో రచయిత అమ్మంగి వేణుగోపాల్‌, 2016లో ప్రజాగాయకుడు, రచయిత గోరటి వెంకన్న అందుకున్నారు. ఈ సంవత్సరం ఖమ్మం జిల్లా  ఆరెంపుల గ్రామానికి చెందిన కవి సీతారాం ను వరించింది. సీతారాం ప్రస్తుతం మహబూబాబాద్ లోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో తెలుగు లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్నారు.