గ్రూప్-2 నియామకాలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

గ్రూప్-2 నియామక ప్రక్రియకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఇచ్చిన స్టే ను కొట్టేసింది. వచ్చే నెల 9లోపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టొచ్చని టీఎస్పీఎస్సీకి అనుమతి ఇచ్చింది. ఏమైనా ఆభ్యంతరాలుంటే కోర్టుకి తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 9 కి వాయిదా వేసింది.  హైకోర్ట్ ఆదేశాలతో ఇక గ్రూప్-2 నియామకాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగనున్నాయి.

గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం జారీచేసిన 2015 నోటిఫికేషన్, 2016 అనుబంధ నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించిన పరీక్షల్లో ప్రశ్నలు, కీ లో జవాబులు తప్పుగా ఉన్నాయంటూ 18 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

2016, నవంబర్ 11, 13 తేదీల్లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని డిసెంబర్ 2వ తేదీన టీఎస్‌పీఎస్సీ రిలీజ్ చేసింది. ఈ ప్రాథమిక కీపై డిసెంబర్ 5 నుంచి 14వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించింది.

గ్రూప్-2 నోటిఫికేషన్ ప్రకారం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలవాల్సి ఉంటుంది. అంతకంటే ముందు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించాలి. నిబంధనలకు అనుగుణంగా అర్హతలు లేనివారిని తిరస్కరించి, అర్హులైన ఇతర అభ్యర్థులను మళ్లీ ఇంటర్వ్యూలకు పిలవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున ఆలస్యాన్ని నిరోధించడానికి సర్టిఫికెట్ల పరిశీలనకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలవాలని కమిషన్ నిర్ణయించింది.

సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన తర్వాత 1:2 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది. సర్టిఫికెట్ల పరిశీలనకు 1:3 నిష్పత్తి ప్రకారం మొత్తం 1032 పోస్టులకు గాను 3096 అభ్యర్థులను పిలవాల్సి ఉంటుంది. దివ్యాంగుల జాబితాలో తిరస్కరణలు ఎక్కువగా ఉండే అవకాశమున్నందున ఆ కోటాలో 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను పిలవాలని నిర్ణయించారు. దీనిప్రకారం మొత్తం 3147 మంది అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తామని కమిషన్ వెల్లడించింది.