గ్రామీణ ఇంజనీరింగ్ విద్యార్థులే టాస్క్

భారతదేశానికి ఉన్న గొప్ప బలం యువతరమని, ప్రపంచంలో ఏ దేశానికి లేనంత యువశక్తి మనదేశంలో ఉందన్నారు ఐటి శాఖ మంత్రి కేటీఆర్. గ్రామీణ ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ ఫలాలు అందేలా బాధ్యత తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన టాస్క్ మరియు ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యాసంస్థల చైర్మన్లు, కంపెనీల ప్రతినిధుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.

వివిధ సబ్జెక్టుల్లో డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు అందుకునేలా శిక్షణ ఇచ్చేందుకు తాము టాస్క్ ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా టాస్క్ అనుకున్న లక్ష్యాల మేరకు పని చేస్తోందని చెప్పారు. అయితే శిక్షణ విషయంలో మరింత ప్రగతి సాధించేందుకు అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, ఇందుకోసం రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ మరియు ఇతర వృత్తి విద్యా కళాశాలలు సహకారం అందజేయాలని మంత్రి కోరారు.

తెలంగాణ ప్రభుత్వం పరిమాణం కంటే ప్రమాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నదని, అందుకోసమే రాష్ట్రంలో నాణ్యతలేని ఇంజనీరింగ్ కళాశాలల పైన గట్టి చర్యలు తీసుకున్నామని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు కొంత మెరుగుపడ్డాయని అభిప్రాయపడ్డారు.

పెద్దఎత్తున ప్రతి సంవత్సరం కళాశాలల నుంచి బయటకు వస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉన్న ప్రధానమైన బలహీనత కమ్యూనికేషన్ స్కిల్స్ అని తమకు పరిశ్రమ వర్గాలు తెలిపాయని మంత్రి కేటీఆర్ వివరించారు. దీంతోపాటు ఇంజనీరింగ్ విద్యకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జర్మనీ దేశ ప్రాక్టీస్ స్కూల్ విధానం తరహాలో ఇక్కడి ఇంజనీరింగ్ విద్యార్థులకు పరిశ్రమలో కనీసం ఒక ఏడాది పాటు ఇంటర్న్ షిప్ ఇవ్వగలిగినప్పుడు వారి ఉద్యోగావకాశాలు మరింత పెరుగుతాయన్నారు. ఆ దిశగా కాలేజీ యాజమాన్యాలు ఆలోచించాలని సూచించారు. ప్రభుత్వ శాఖల్లో విద్యార్థులకు ఇంటర్న్ షిప్ అవకాశాన్ని కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి విద్యాసంస్థల ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రం చేస్తున్న కార్యక్రమాలకు తోడుగా కళాశాలలో సొంతంగా పలు కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరముందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తామన్నారు. ఇప్పటికీ చాలా కళాశాలలు అత్యుత్తమ ప్రమాణాల కోసం ప్రయత్నం చేస్తున్నాయని మంత్రి ప్రశంసించారు. అయితే, కొన్ని కళాశాలలకు ఉన్న వ్యాపార దృక్పథంతో విద్యార్థులు కొంత మేర నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల పట్ల కళాశాలల యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు.

గ్రామీణ విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విషయంలో టాస్క్ ప్రత్యేక శ్రద్ధ వహించి, వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే చాలా మందిని విజయవంతంగా పలు కంపెనీల ఉద్యోగులుగా చేసిందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు వరంగల్, నిజామాబాదు జిల్లాల్లో టాస్క్ ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు.

టాస్క్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని అత్యుత్తమ ఫలితాలు సాధించిన కాలేజీలకు, శిక్షణ కార్యక్రమాలు, విద్యాబోధన వంటి పలు రంగాల్లో ముందు వరుసలో నిలిచిన పలు కాలేజీలకు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మెమొంటోలను అందజేశారు.