గౌరి హత్యపై నివేదిక కోరిన కేంద్రం

బెంగళూరులో ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ హత్యకు సంబంధించి నివేదిక ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ కోరింది. గౌరి హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ స్పందించారు. వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించాలని హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు.

అటు గౌరీ లంకేశ్‌ హత్యకేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమైనట్టు తెలుస్తోంది. ఆమె ఇంటి వద్ద ఉన్న రెండు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల నుంచి ఈ హత్యకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించినట్టు సమాచారం. పాస్‌ వర్డ్‌ ప్రొటెక్షన్‌ కల్గిన రెండు డి.వి.ఆర్‌ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు… ఐటీ నిపుణుల సాయంతో వాటిని తెరిచి పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు. బాధితురాలితో పాటు నిందితులు కూడా ఒకే ఫ్రేమ్‌ లో ఉన్న ఫోటోలు కొన్ని లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా ఆమెను దగ్గరనుంచే షూట్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. పూర్తిస్థాయిలో నిర్థారించేందుకు ఈ ఆధారాలను ఫోరెన్సిక్‌ లేబొరేటరీకి పంపించారు.