గో రక్షకుల ఆగడాలపై సుప్రీం సీరియస్‌

దేశ వ్యాప్తంగా అరాచకం సృష్టిస్తున్న గో రక్షకుల ఆగడాలపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయ్యింది. గో రక్షణ పేరిట జరుగుతున్న హింసకు చెక్‌ పెట్టాలని సూచించింది. ఇందుకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు టాస్క్‌ ఫోర్స్ లను ఏర్పాటుచేయాలని ఆదేశించింది. సీనియర్‌ పోలీసు అధికారిని నోడల్‌ ఆఫీసర్‌ గా నియమిస్తూ వారంలోగా టాస్క్‌ ఫోర్స్‌ ను ఏర్పాటు చేయాలని తేల్చిచెప్పింది.

గో రక్షణ పేరిట దళితులు, మైనారిటీలపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయని… ఈ దాడులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త తెహసీన్‌ ఎస్‌. పూనావాలా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు… గో రక్షణ పేరిట జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఏం చర్యలు తీసుకున్నారో తెలుపాలని కేంద్రాన్ని కోరింది. గో రక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకోవద్దని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.