గోరఖ్ పూర్ తరహాలోనే మరో విషాదం

ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌ పూర్‌ బీఆర్డీ ఆస్పత్రిలో నెల రోజుల్లో వందల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాదం నుంచి తేరుకోకముందే… మళ్లీ అలాంటి ఘటనే జరిగింది. ఈసారి కూడా యూపీలోనే ఫరూఖాబాద్‌ రామ్‌ మనోహర్‌ లోహియా జిల్లా ఆస్పత్రిలో చిన్నారులు పిట్టల్లా రాలిపోయారు. నెల రోజుల వ్యవధిలోనే దాదాపు 49 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఆస్పత్రిలో మందులు, ఆక్సిజన్ కొరత కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులే చెబుతున్నారు.

గత నెలలోనే గోరఖ్‌ పూర్‌ ఆస్పత్రి ఘటనలో వందకు పైగా చిన్నారులు మృతి చెందారు. దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రతి ఒక్కరు ఈ విషాదంపై స్పందించారు. ఐనా ఈ విషాదం నుంచి యూపీ సర్కార్‌, అక్కడి అధికారులు గుణపాఠం నేర్చుకోలేదు. మళ్లీ అదే నిర్లక్ష్యం కారణంగా 49 మంది చిన్నారుల తల్లితండ్రులకు కడపు కోత మిగిల్చారు.

జిల్లా మెజిస్ట్రేట్‌ రవీంద్ర కుమార్‌ దర్యాప్తు బృందం ఆస్పత్రికి వెల్లడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఆస్పత్రి వర్గాలను జిల్లా మెజిస్ట్రేట్‌ సమగ్ర నివేదికను ఇవ్వాలని కోరారు. చిన్నారుల తల్లిదండ్రులు ఆక్సిజన్‌, మందుల సరఫరా కొరతపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు కారకులుగా భావిస్తూ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ తో సహా మొత్తం ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్సీ దయానంద్‌ మిశ్రా తెలిపారు.

నెల రోజుల వ్యవధిలోనే రెండు ఆస్పత్రుల్లో ఇలాంటి ఘటనలు జరగటంపై యూపీ సర్కార్ సీరియస్‌ గా ఉంది. చిన్నారుల వైద్యానికి అవసరమైన అన్ని సదుపాయాలను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచాలని అన్ని హాస్పిటల్స్ కు ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని కోరింది.