గుర్మీత్‌కు మరిన్ని కష్టాలు!

రేప్‌ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా గుర్మీత్ సింగ్‌ ను పాత కేసులు చుట్టుముడుతున్నాయి. తన చీకటి వ్యవహారాలకు అడ్డుపడుతున్నారని అప్పట్లో జర్నలిస్ట్‌ రామ్‌ చంద్ర ఛత్రపది, డేరా మాజీ మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌లను హత్య చేయించినట్లు గుర్మీత్ ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. రేప్ కేసులో గుర్మీత్ కు జైలుశిక్ష పడిన సందర్భంగా హింస చెలరేగటంతో ఈ సారి రోహ్‌తక్ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే విచారించారు.

ఐతే రెండు హత్యలకు సంబంధించి కేసులో కీలక సాక్ష్యిగా గుర్మీత్ మాజీ డ్రైవర్‌ కట్టాసింగ్. 2007 లో గుర్మీత్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన కట్టాసింగ్‌…2012 లో మాట మార్చాడు. ఈ హత్యలతో గుర్మీత్ కు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో సాక్ష్యం చెప్పాడు. ఐతే ప్రస్తుతం డేరా బాబా జైల్లో ఉండటంతో మరోసారి అతను తన స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని కోరాడు. అప్పట్లో తన కుమారున్ని చంపుతానని బెదిరించటంతో తప్పుడు సాక్ష్యం చెప్పానని అంగీకరించాడు. ఐతే ప్రస్తుతం తన క్లయింట్ పై ఎలాంటి ఒత్తిడి లేదని నిజం చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని కట్టాసింగ్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు.

పంచకుల ప్రత్యేక న్యాయస్థానం మాత్రం…మళ్లీ కట్టాసింగ్ స్టేట్‌ మెంట్ తీసుకోవాలా వద్దా అన్న దానిపై ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 22 వ తేదీన దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఐతే కట్టాసింగ్ గుర్మీత్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే మాత్రం గుర్మీత్ కు మళ్లీ ఇబ్బందులు తప్పవని సమాచారం. ఇప్పటికే పోలీసులు…జంట హత్యలతో గుర్మీత్ సంబంధం ఉందని అభియోగాలు మోపారు.