గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు

ఈ నెల 5న హైదరాబాద్ లో జరిగే గణేష్‌ నిమజ్జనం కోసం ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. హుస్సేన్ సాగర్ లో గ‌ణేష్ విగ్రహాల‌ నిమజ్జనం సాఫీగా జ‌ర‌గ‌డానికి జీహెచ్ఎంసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. ట్యాంక్ బండ్ మీద మొత్తం 38 భారీ క్రేన్లను ఏర్పాటు చేయబోతున్నారు. భక్తుల కోసం తాగునీటి సౌకర్యాలు, టెంపరరీ టాయిలెట్లు నిర్మిస్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. శోభాయాత్ర సాగే మార్గంలో రోడ్ల మ‌ర‌మ్మతులు, అద‌న‌పు విద్యుత్ దీపాల ఏర్పాటు, తాత్కాలిక మ‌రుగు దొడ్ల ఏర్పాటు, అద‌న‌పు వాహ‌నాలు ఏర్పాటు చేయనున్నారు.

వినాయక నిమజ్జన శోభాయాత్ర నగరంలో దాదాపు 354 కిలోమీటర్ల మేర సాగనుంది. అందుకోసం బల్దియా పరిధిలో 168 యాక్షన్ టీంలు, 10 వేల మంది శానిటేషన్ కార్మికులు, 295 మంది జవాన్లు, 688 ఎస్ఎఫ్ఎ సిబ్బంది పనిచేయనున్నారు. ఒక్కో ఘాట్ వద్ద 21 మంది పారిశుధ్య కార్మికులు, ఒక సూపర్ వైజర్, ఒక జవాన్, ముగ్గురు ఎస్ఎఫ్ఎ లు మూడు షిఫ్టుల్లో పనిచేస్తారు. వీరితో పాటు చెరువుల దగ్గర దోమల నివారణకు 1000 మంది ఎంటమాలజీ సిబ్బందిని నియమించారు. ఇప్పటికే ట్యాంక్‌ బండ్ మీద భారీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇరిగేషన్‌, పోలీస్‌, జీహెచ్‌ఎంసీ, ఎలక్ట్రిసిటీ విభాగాలు కంట్రోల్‌ రూమ్‌ లను ఏర్పాటు చేశాయి. ఇప్పటికే ట్యాంక్‌ బండ్‌ ప్రాంతం గణేష్‌ విగ్రహాల నిమజ్జనంతో కోలాహలంగా మారింది.