ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర ప్రారంభం

పదకొండురోజులపాటు అశేష భక్తజనుల పూజలందుకున్న శ్రీ చండీకుమార అనంత మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. అరవై అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకున్న ఈ భారీ గణనాథుడి శోభాయాత్ర ఖైరతాబాద్ సెన్సేషన్ థియేటర్ మీదుగా రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్‌భవన్, ఇక్బాల్ మినార్, సెక్రటేరియట్ ఫ్లైఓవర్, లుంబినీ పార్కు మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్ నంబర్ నాలుగు వద్దకు చేరుకోనుంది. అక్కడ అనంతరూపుడికి మరోసారి పూజలు చేసి గుమ్మడికాయతో దిష్టితీస్తారు. అనంతరం మహాగణపతి నిమజ్జనం పర్వం ముగుస్తుంది. శోభాయాత్ర మార్గంలో భక్తులు, ప్రజలు సంప్రదాయక నృత్యాలు కొనసాగిస్తున్నారు. భారీ విఘ్నేశ్వరుడి శోభాయాత్రను కనులారా వీక్షించేందుకు రాష్ట్ర్రం నలుమూలల నుంచి భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.