కొలిక్కిరాని ఆర్టీసీ ఆస్తుల పంపకం

ఉమ్మడి రాష్ట్ర విభజనకు అనేక  అనేక ఇబ్బందులు, అడ్డంకులు సృష్టించిన ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా శాఖాపరమైన విభజనకు సంబంధించిన అంశాలు, ఆస్తుల పంపకంలో అలాంటి నాటకాలే ప్రదర్శిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలోని ఆస్తులపై కన్నేసిన ఏపీ, వాటిని డొంక తిరుగుడుగా, దొడ్డిదారిన సొంతం చేసుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నది. సంస్థ ఆస్తుల విభజనే ప్రధాన అజెండాగా విజయవాడలోజరిగిన ఆర్టీసీ బోర్డుసమావేశం ఇందుకు తాజా తార్కాణం.

సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం హైదరాబాద్‌ లోని ఒక్క బస్‌ భవన్‌ పైనే హక్కు ఉండగా.. రాజధానిలోని మొత్తం 14 ఆస్తుల్లో తమకు వాటా ఇవ్వాలని ఏపీఎస్‌ ఆర్టీసీ మొండి వాదనకు దిగింది. ఇందుకు టీఎస్‌ ఆర్టీసీ అంగీకరించలేదు. రెండు రాష్ట్రాల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి, షీలా బేడీ కమిటీకి పంపిద్దామని తెలంగాణ అధికారులు కోరారు. ఏపీ అధికారులు ఒప్పుకోకుండా ఆస్తుల పంపకాలపై ఓటింగ్‌ కు పట్టుబట్టారు. బోర్డులో మెజారిటీ ఉందని, ఈ విధంగా ఓటింగ్‌ కు ఏపీ పట్టుబట్టడం సరికాదని టీఎస్‌ అధికారులు అభ్యంతరం చెప్పారు. అయినా వారు వినకపోవడంతో నిరసనగా సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. ఏపీవైఖరి కారణంగా బోర్డుసమావేశం అర్ధాంతరంగా ముగిసింది.

మరోవైపు ఆర్టీసీ ఆస్తుల విభజన, ఇతర అంశాలపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఆస్తుల విభజనపై కేంద్రహోంశాఖకు ప్రతిపాదనలను పంపించాలని నిర్ణయించినట్లు తెలిపాయి. టీఎస్‌ఆర్టీసీ బోర్డు డైరెక్టర్లు.. త్వరలో సీఎం కేసీఆర్‌ను కలిసి ఈ మేరకు కేంద్రానికి నివేదిక పంపించే ఆలోచనలో ఉన్నట్లు తెలంగాణ ఆర్టీసీ వర్గాల సమాచారం.