కొరియా ఓపెన్ సెమీస్ లోకి సింధు

కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీస్ లోకి పీవీ సింధు దూసుకెళ్లింది. ఇవాళ జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైనల్స్ లో సింధు అద్భుత‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించింది. జ‌పాన్‌ కు చెందిన మిన‌త్సు మితానిపై  21-19, 16-21, 21-10 స్కోర్‌ తో సింధు విక్ట‌రీ సాధించింది. ఇటీవ‌ల సూప‌ర్ ఫామ్‌ లో ఉన్న సింధు, కొరియా సిరీస్‌ లోనూ హ‌డ‌లెత్తించింది. ఫుల్ కాన్ఫిడెంట్‌ గా ఉన్న సింధు బ‌ల‌మైన స్మాష్‌ ల‌తో అద‌ర‌గొట్టింది. తొలి గేమ్‌ ను సింధు గెలిచినా  రెండ‌వ గేమ్‌ లో జ‌పాన్ ప్లేయ‌ర్ టాప్ గేమ్ ఆడింది. అయితే, కీల‌క‌మైన మూడ‌వ గేమ్‌ ను మాత్రం సింధు ఈజీగా గెలిచింది.

నిన్న (గురువారం) జరిగిన రెండో రౌండ్‌ లో ఐదో సీడ్ సింధు  22-20, 21-17తో ప్రపంచ 16వ ర్యాంకర్ నిచెన్ జిందాపోల్ (థాయ్‌ లాండ్)పై గెలిచింది. 42 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌ లో అంతర్జాతీయ అనుభవం తక్కువైనా జిందాపోల్ గట్టిపోటీ ఇచ్చింది. ముఖాముఖి రికార్డులో 1-1తో సమంగా ఉన్న ఈ థాయ్ అమ్మాయి.. సింధు కొట్టిన ర్యాలీలను అద్భుతంగా తీసింది. నువ్వానేనా అన్నట్లుగా సాగిన తొలి గేమ్‌ లో సింధు 9-7, 13-10 ఆధిక్యంలోకి దూసుకెళ్లినా.. నెట్ వద్ద సులువైన డ్రాప్స్ వేస్తూ, సుదీర్ఘమైన ర్యాలీలను కచ్చితమైన షాట్లతో కొట్టిన థాయ్ ప్లేయర్ అలవోకగా 14-14తో సమం చేసింది.