కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ విజేత సింధు

వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ నొజొమి ఒకుహ‌ర‌పై ప్ర‌తీకారం తీర్చుకుంది పీవీ సింధు. కొరియా ఓపెన్ సూప‌ర్ సిరీస్ ఫైన‌ల్లో ఒకుహ‌ర‌పై 22-20, 11-21, 21-18 తేడాతో గెలిచి ప్ర‌పంచ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఎదురైన ఓట‌మికి బ‌దులు తీర్చుకుంది. టైటిల్ కోసం ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ తీవ్రంగా పోటీప‌డ్డారు. తొలి గేమ్ నుంచే నువ్వా నేనా అన్న‌ట్లు సాగిందీ మ్యాచ్‌. తొలి గేమే హోరాహోరీగా సాగింది. ఒక్కో పాయింట్ కోసం ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ తీవ్రంగా ఫైట్ చేశారు. సింధు 18 పాయింట్ల ద‌గ్గ‌ర ఉన్న స‌మ‌యంలో వ‌రుస‌గా రెండు పాయింట్లు కొట్టిన ఒకుహ‌ర‌.. గేమ్ పాయింట్ ముంగిట నిలిచింది. ఈ స‌మ‌యంలో రెండు గేమ్ పాయింట్ల‌ను కాచుకున్న సింధు.. వ‌రుస‌గా నాలుగు పాయింట్లు సాధించింది. దీంతో 22-20 స్కోరుతో తొలి గేమ్‌ను ఎగురేసుకుపోయింది. రెండో గేమ్‌లో మాత్రం ఒకుహ‌ర మొద‌టి నుంచీ దూకుడుగా ఆడింది. సింధుకు ఏమాత్రం చాన్స్ ఇవ్వ‌లేదు. చ‌క‌చ‌కా పాయింట్లు సాధిస్తూ.. ఏకంగా 21-11 తేడాతో రెండో గేమ్‌లో గెలిచి 1-1తో మ్యాచ్‌ను స‌మం చేసింది. దీంతో మ్యాచ్ మూడో గేమ్‌లోకి వెళ్లింది. నిర్ణ‌యాత్మ‌క గేమ్‌లో సింధు మ‌ళ్లీ పుంజుకుంది. ఇక టైటిల్‌ను డిసైడ్‌ చేసే మూడో సెట్లో సింధు మళ్లీ పుంజుకుని 21-18తో టైటిల్‌ను దక్కించుకుంది.