కొరియా ఓపెన్ సిరీస్‌లో ఫైన‌ల్‌కు సింధు

కొరియా ఓపెన్ బ్యాడ్మింట‌న్ సిరీస్‌లో పీవీ సింధు ఫైన‌ల్‌కు చేరింది. చైనా క్రీడాకారిణి హి బింగ్‌జియావోతో సింధు త‌ల‌పడింది. మ్యాచ్ ప్రారంభం నుంచే సింధు మంచి ప్ర‌ద‌ర్శ‌నను క‌న‌బ‌రిచి 21-10, 17-21, 21-16 తేడాతో హి బింగ్‌జియావోను ఓడించింది. మ‌రోప‌క్క అకానే య‌మ‌గూచితో జ‌రిగిన మ్యాచ్‌లో నోజోమీ ఒకుహారా కూడా సెమీస్‌ గెలిచి, ఫైన‌ల్‌కు చేరుకుంది. దీంతో మ‌రోసారి నోజోమీతో ఫైన‌ల్ మ్యాచ్‌ త‌ల‌ప‌డే అవ‌కాశం సింధుకి వ‌చ్చింది. ఇటీవ‌ల గ్లాస్గోలో జరిగిన ప్ర‌పంచ బ్యాడ్మింట‌న్ సిరీస్ ఫైన‌ల్లో కూడా సింధు, నోజోమీతో త‌ల‌ప‌డింది. అయితే ఆ మ్యాచ్‌లో సింధు ఓడిపోవ‌డంతో నోజోమీ బంగారు ప‌త‌కం గెల్చుకుంది. కొరియా ఓపెన్ సిరీస్ ఫైన‌ల్ ద్వారా ఆ ఓట‌మికి స‌మాధానం ఇచ్చే అవ‌కాశం సింధుకి క‌ల‌గ‌నుంద‌ని అభిమానులు అభిప్రాయ‌పడుతున్నారు.