కొత్త సంవత్సర కానుకగా ఇంటింటికి నీళ్లు

నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం ద్వారా జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి ఇంటింటికి తాగునీరు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ముందుకు సాగుతోందని మంత్రులు జోగు రామ‌న్న‌, అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్‌ రెడ్డి చెప్పారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం పురోగ‌తిపై హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో మంత్రులు స‌మీక్షించారు.

డిసెంబ‌ర్‌ లోగా మిష‌న్ భ‌గీర‌థ ప‌నులు పూర్తి చేయాల‌ని మంత్రులు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో ఉండి ప‌నుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించాల‌ని, స‌మ‌స్య‌లు ఏమైనా ఎదురైతే వెంటనే త‌మ దృష్టికి తీసుకు రావాల‌ని సూచించారు. ఇది సీఎం కేసీఆర్ ప్ర‌తిష్ఠాత్మ‌క ప‌థ‌క‌మ‌ని, సీఎం కేసీఆర్ క‌ల నెర‌వేర్చేందుకు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌న్నారు. అధికారులు మిష‌న్ భ‌గీర‌థ ప‌నుల‌ను స‌వాల్‌ గా తీసుకుని గ‌డువులోగా పూర్తి చేయాల‌న్నారు.

వాట‌ర్ గ్రిడ్ సెగ్మెంట్ వారీగా, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం వారీగా ప‌నుల పురోగ‌తిపై మంత్రులు స‌మీక్షించారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో జ‌రుగుతున్న ప‌నుల ప‌ట్ల మంత్రులు సంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో 6,028 కిలోమీట‌ర్ల మేర‌కు పైప్‌లైన్లు వేయాల‌ని ల‌క్ష్యం కాగా ఇప్ప‌టి వ‌ర‌కు 3,800 కిలోమీట‌ర్ల వ‌ర‌కు పైప్‌ లైన్ల ప‌నులు పూర్తి అయిన‌ట్లు అధికారులు తెలిపారు. వాట‌ర్ ట్రీట్‌ మెంట్ ప్లాంట్ల ద్వారా ప్ర‌తి రోజు భైంసా ప‌రిధిలో 50 మిలియ‌న్ లీట‌ర్ ప‌ర్ డే (ఎంఎల్‌డీ), మాడేగావ్ ప‌రిధిలో 130 ఎంఎల్‌డీ, కొమురం భీం 115 ఎంఎల్‌డీ, ధ‌నోరా 30 ఎంఎల్‌డీ, మంచిర్యాల 95 ఎంఎల్‌డీ, క‌డెం 23 ఎంఎల్‌డీని అందించ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. దాదాపు 90 శాతం మిష‌న్ భ‌గీర‌థ ప‌నులు పూర్తి అయిన‌ట్లు వివరించారు.

మున్సిపాలిటీల వారీగా చూస్తే..
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రూ.82.16 కోట్ల‌తో  12 వేల ఇళ్ళకు, నిర్మ‌ల్ మున్సిపాలిటీలో రూ. 39.19 కోట్ల‌తో  9,489 ఇళ్ళు, కాగ‌జ్‌ న‌గ‌ర్‌ లో రూ. 32.1 కోట్ల‌తో 10 వేల ఇళ్ళు, మంచిర్యాల‌లో రూ. 53.29 కోట్ల‌తో 18,200 ఇళ్ళు, బెల్లంప‌ల్లిలో రూ. 38.10 కోట్ల‌తో 11 వేల ఇళ్ళు, మంద‌మ‌ర్రిలో రూ. 38.75 కోట్ల‌తో 14,774 ఇళ్ళు, భైంసాలో రూ. 44.60 కోట్ల‌తో 13,254 ఇళ్ళ‌కు తాగునీటిని అందించాల‌న్న ల‌క్ష్యంతో ప‌నులు సాగుతున్నాయి.

ఈ స‌మావేశంలో శాస‌న మండ‌లి చీఫ్ విప్ పాతూరి సుధాక‌ర్‌ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ న‌ల్లాల ఓదేలు, ఎమ్మెల్సీ పురాణం స‌తీశ్‌ కుమార్‌, ఎమ్మెల్యేలు కోనేరు కొన‌ప్ప‌, దివాక‌ర్‌ రావు, విఠ‌ల్‌ రెడ్డి, రాథోడ్ బాబురావు, దుర్గం చిన్న‌య్య‌, రేఖానాయ‌క్‌, ఈఎన్‌సీ సురేంద‌ర్‌ రెడ్డి, సీఈ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి, ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.