కొత్త జిల్లాలకు సఖీ కేంద్రాలు

తెలంగాణ‌లో కొత్త‌గా ఏర్ప‌డిన 21 జిల్లాల్లో స‌ఖీ కేంద్రాల‌ను ఇచ్చేందుకు కేంద్రం అంగీక‌రించింది. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం హైదరాబాద్ కు వ‌చ్చిన కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి మేన‌కాగాంధీ.. రాష్ట్ర విన‌తుల‌పై ఆమె సానుకూలంగా స్పందించారు. ప్ర‌ధానంగా తెలంగాణ‌లో కొత్త‌గా ఏర్ప‌డిన జిల్లాల్లో స‌ఖీ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని, మ‌హిళా శ‌క్తి కేంద్రాల‌ను ఇవ్వాల‌న్నరాష్ట్ర మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు విన‌తి మేర‌కు కేంద్ర‌మంత్రి వెంట‌నే స్పందించారు. పాత ప‌ది జిల్లాల్లో ఉన్న తొమ్మిది స‌ఖీ కేంద్రాల‌కు అద‌నంగా మ‌రో 21 కేంద్రాల‌ను అన్ని జిల్లా కేంద్రాల్లో ఇచ్చేందుకు అంగీకరించారు. మ‌హిళా శ‌క్తి కేంద్రాల‌కు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను ఇప్ప‌టికే కేంద్రానికి పంపిన విష‌యాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు మ‌హిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్ట‌ర్ విజ‌యేంద్ర బోయి. త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని హామీనిచ్చారు కేంద్రమంత్రి.