కొత్త గవర్నర్ల వివరాలివే!

దసరా పండగ పూట ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించారు రాష్ట్రపతి రామ్  నాథ్ కోవింద్‌. తమిళనాడు, బీహార్‌, మేఘాలయ, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్ లకు గవర్నర్‌ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ కు సైతం లెఫ్టినెంట్ గవర్నర్ ను నియమించారు. వీరిలో ఒకరు ఆర్మీ ఉన్నతాధికారి కాగా.. మరొకరు మాజీ నేవీ చీఫ్ ఉన్నారు.

కొన్ని మార్పులు చేర్పులతో ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లు వచ్చారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ గవర్నర్ల నియామక ఉత్తర్వులపై సంతకం చేశారు. గత కొద్ది రోజులుగా ఇన్‌ఛార్జ్ గవర్నర్ తో పాలన సాగిస్తున్న తమిళనాడుకు పూర్తిస్థాయి గవర్నర్‌ వచ్చారు. అస్సాం గవర్నర్ గా విధులు నిర్వహిస్తున్న భన్వరిలాల్ పురోహిత్ ను తమిళనాడు గవర్నర్ గా నియమించారు రాష్ట్రపతి. మహారాష్ట్రకు చెందిన ఈయన… విదర్భలో మంచి లీడర్‌ గా గుర్తింపు పొందారు.

బీహార్ గవర్నర్‌ ను కూడా మార్చారు రాష్ట్రపతి. కేసరినాథ్ త్రిపాఠి స్థానంలో సత్యపాల్  మాలిక్‌ ను నియమించారు. ఉత్తర ప్రదేశ్‌ లో జన్మించిన సత్యపాల్‌.. అలీగఢ్‌ లో లా పూర్తి చేశారు. అనంతరం జనతాదళ్‌ లో చేరి భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారు. అప్పుడే పార్లమెంట్‌ వ్యవహారాలు, టూరిజం సహాయ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.

ఆర్మీ మాజీ అధికారి, బ్రిగేడియర్‌ డాక్టర్ బీడీ మిశ్రాను అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌ గా నియమించారు. పద్మనాభ ఆచార్య స్థానంలో మిశ్రాను ఎంపిక చేశారు. 78 ఏళ్ల మిశ్రా.. ఎన్‌ఎస్‌జీ బ్లాక్ క్యాట్ కమాండోస్ కు కామాండర్ గా పని చేశారు. 1993లో అమృత్ సర్‌లో ఇండియన్ ఎయిర్ లైన్స్‌ విమానం హైజాక్ అయినప్పుడు చాకచక్యంగా వ్యవహరించి ఉగ్రవాదులు చెర నుంచి విమానాన్ని విడిపించారు. 1962 చైనా యుద్ధంలోనూ పాల్గొన్నారు. 1971లో బంగ్లాదేశ్‌ లిబరేషన్‌ ఆపరేషన్‌, 1988లో ఎల్‌టీటీఈ ఆపరేషన్‌ లో భాగంగా శ్రీలంకలో పని చేశారు. పదవీ విరమణ తర్వాత కార్గిల్ వార్‌ సమయంలో వాలంటీర్‌ గాను పని చేశారు బీడీ మిశ్రా.

మేఘాలకు సైతం కొత్త గవర్నర్‌ వచ్చారు. బిహార్‌ కు చెందిన గంగా ప్రసాద్‌ ను గవర్నర్‌ గా నియమించారు. ఈయన 18 ఏళ్లపాటు ఎమ్మెల్సీగా, 5ఏళ్లు బీహార్‌ ప్రతిపక్ష నేతగా పని చేశారు. పంజాబ్ కు చెందిన ప్రొఫెసర్‌ జగదీష్ ముఖిని అస్సోం గవర్నర్‌ గా నియమించారు. ఈయన అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్‌ గా పని చేశారు.

అండమాన్ నికోబార్ దీవులకు కూడా కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌ వచ్చారు. నేవీ చీఫ్‌ దేవేంద్ర కుమార్ జోషిని లెఫ్టినెంట్ గవర్నర్‌ గా నియమించారు రాష్ట్రపతి. ఈయన సింగపూర్‌ లో 1996 నుంచి 99 వరకు ఇండియన్ హై కమిషన్‌ లో విధులు నిర్వహించారు.