కేసీఆర్ కిట్@ 100 డేస్

కేసీఆర్ కిట్  ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం కోసం వచ్చే ప్రతి గర్భిణికి భరోసా కల్పించే బృహత్తరమైన పథకం. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేద, గ్రామీణ మహిళలకు ఈపథకం గొప్ప వరం. గర్భిణులకు గౌరవం దక్కేలా, ప్రసవాలన్నీ సర్కార్ దవాఖానలో జరిపించి మాతాశిశు సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వందశాతం ప్రసవాలు సర్కారు దవాఖానల్లోనే జరుగాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన కేసీఆర్‌ కిట్‌ కు అద్భుత స్పందన వస్తోంది. జూన్‌ రెండో తేదీన ప్రారంభమైన ఈ పథకం దిగ్విజయంగా వంద రోజులు  పూర్తిచేసుకుంది. సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంతో వైద్యారోగ్య శాఖ పక్కాగా ఈ పథకాన్ని అమలుచేస్తోంది.

కేసీఆర్‌ కిట్‌ పథకం ప్రారంభమైన జూన్‌ రెండో తేదీ తర్వాత.. లక్షా 65వేల 961 గర్భిణులు ప్రభుత్వాసుపత్రుల్లో తమ పేర్లును నమోదు చేసుకున్నారు. జూన్‌ రెండో తేదీ తర్వాత నుంచి.. ప్రభుత్వాసుపత్రుల్లో లక్షా 83 వేల 801 మంది గర్భిణులకు యాంటీ నాటల్‌ పరీక్షలు నిర్వహించారు. అందులో 67 వేల 474 మంది సర్కారీ దవాఖానల్లో ప్రసవించారు. వారిలో  59 వేల 900 మందికి కేసీఆర్‌ కిట్‌ లను అందజేశారు. ఇప్పటివరకు కేసీఆర్‌ కిట్‌ పథకంలో ఉన్న 81 వేల 649 మంది కోసం ప్రభుత్వం.. 30కోట్ల 86 లక్షల 59 వేలు పంపిణీ చేయనుంది. ఇందులో ఇప్పటికే 77వేల 91 మందికి.. 28 కోట్ల ఒక లక్షా 83వేలు వారి ఖాతాల్లో జమచేసింది. అటు మరో 4 వేల 558 మందికి 2 కోట్ల 84 లక్షల 76వేలు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ నడుస్తోంది.

కేవలం కేసీఆర్‌ కిట్‌ మాత్రమే కాకుండా.. గర్భవతిగా నిర్ధారణ అయినప్పటి నుంచి ప్రతి నెలకోసారి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ దవఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆడపిల్ల పుడితే 13వేలు, మగపిల్లాడు పుడితే 12వేల నగదును బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది ప్రభుత్వం. గర్భవతిగా ప్రభుత్వాసుపత్రిలో పేరు నమోదు చేయించుకొని.. పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం తొలి విడతగా.. మూడు వేలు ఇస్తున్నారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో కాన్పు జరిగితే.. ఆడపిల్ల అయితే 5వేలు, మగపిల్లాడు అయితే 4వేలు రెండో విడతగా ఇస్తున్నారు. మూడో విడతగా 2వేలు, బిడ్డకు తొమ్మిది నెలలు నిండిన తర్వాత.. మరో మూడు వేలు ప్రోత్సాహకంగా అందిస్తున్నారు. ఒక జిల్లాలో పేరు నమోదు చేయించుకుని కాన్పు తర్వాత .. మరో జిల్లాకు వెళ్లిన వారి రికార్డులను చూసేలా ఓ నంబర్‌ ను కేటాయిస్తున్నారు. దీనికోసం ఓ ప్రత్యేక సాఫ్ట్‌ వేర్‌ రూపొందించారు. భవిష్యత్‌ లో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే హయ్యర్‌ సెంటర్‌ కు రిఫరెన్స్‌ చేసిన సందర్భంలోనూ వారి రికార్డును ఈ సాఫ్ట్‌ వేర్‌ ద్వారా చూసి.. మెరుగైన వైద్యం  అందించవచ్చు.

కేసీఆర్‌ కిట్‌ పై బాలింతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్‌ ..తండ్రిలాగే తమకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారంటున్నారు. అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వందశాతం నార్మల్‌ డెలివరీ చేయడానికే వైద్యులు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్తున్నారు. 24 గంటలు డ్యూటీలో వైద్యులు అందుబాటులో ఉంటున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ కు తాము జీవితాంతం రుణపడి ఉంటామంటున్నారు.

కేసీఆర్‌ కిట్‌ తో గర్భిణులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు కమిషనర్‌ ఆఫ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ వాకటి కరుణ. జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో 20శాతం ప్రసవాలు పెరిగాయన్నారు. నిరుపేద గర్భిణులకు కేసీఆర్‌ కిట్‌ వరంలాంటిదన్నారు.

టీఆర్ఎస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రవ్యాప్తంగా శిశుమరణాల సంఖ్య చాలా వరకు తగ్గింది. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందిలో 28 మంది పుట్టిన కొద్ది రోజులకే చనిపోతున్నారు. ఇదే సంఖ్య ఏపీలో  35గా ఉండగా..  ఓవరాల్‌ గా దేశంలో  40గా ఉంది. మరోవైపు గర్భస్రావ మరణాలు కూడా రాష్ట్రంలో చాలావరకు తగ్గాయి. ఈ మరణాల సంఖ్య రాష్ట్రంలో ప్రతి లక్ష మందికి 92గా ఉండగా.. ఇదే సంఖ్య కర్ణాటకలో 133గా ఉంది. అటు   దేశంలో 167గా ఉంది. మాతాశిశు సంరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేయటంతో మరణాలు చాలా తగ్గాయని అధికారులు చెబుతున్నారు. కేసీఆర్ కిట్ పథకం నిరుపేద గర్భిణుల పాలిట వరంగా మారిందంటున్నారు.